మౌలిక సదుపాయాలు కల్పిస్తే.. మహర్దశ!
రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఏర్పేడు-శ్రీకాళహస్తి మధ్య ప్రాంతానికి మహర్దశ పట్టడం ఖాయమని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఏర్పేడు-శ్రీకాళహస్తి మధ్య నిమ్జ్(నేషనల్ మ్యానుఫాక్చరింగ్ ఇన్వెస్ట్‌మెంట్ జోన్) ఏర్పాటుకు బడ్జెట్‌లో కేంద్రం నిధులు మంజూరు చేసిన విషయం విదితమే. మౌలిక సదుపాయాలు కల్పిస్తే రూ.31 వేల కోట్ల పెట్టుబడులను నిమ్జ్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) భారత్ విభాగం డెరైక్టర్ హున్ కిమ్ ఈనెల 7న సీఎం చంద్రబాబుకు స్పష్టీకరించడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌లో మన జిల్లాను కేంద్రం ఎంపిక చేసింది. కృష్ణపట్నం నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న ఏర్పేడు-శ్రీకాళహస్తి మధ్య ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. రాజ దాని ఎంపికపై డాక్టర్ శివరామకృష్ణన్ కమిటీ జూలై 9న తిరుపతిలో పర్యటించి.. రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఉపాధి కల్పించడానికి పారిశ్రామికాభివృద్ధి ఒక్కటే శరణ్యమని స్పష్టీకరించింది. ఇదే అంశాన్ని కేంద్రానికి నివేదించింది.
డాక్టర్ శివరామకృష్ణన్ నివేదికను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం శ్రీకాళహస్తి-ఏర్పేడు మధ్య ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటుకు 201 4-15 బడ్జెట్లో నిధులను సైతం కేటాయించింది. నిమ్జ్ ఏర్పాటుకు ఏడీబీ అధికారులు, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రణాళిక రచించాయి. ఈ మేరకు ఈనెల 7న సీఎం చంద్రబాబుతో ఏడీబీ భారత్ విభాగం డెరైక్టర్ హున్ కిమ్ సమావేశమయ్యారు. యూరోపియన్ యూనియర్, అమెరికా, చైనా సంస్థలతో చర్చించి రూ.31 వేల కోట్లతో శ్రీకాళహస్తి-ఏర్పేడు నిమ్జ్‌లో పరిశ్రమలను స్థాపించేందుకు ప్రయత్నిస్తామని హున్ కిమ్ ప్రతిపాదించారు. కానీ.. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే పెట్టుబడులు పెట్టేందుకు బహుళ జాతి సంస్థలు ముందుకొస్తాయని స్పష్టీకరించారు.
శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గమే ప్రధానం
శ్రీకాళహస్తి-ఏర్పేడు మధ్య ప్రాంతాన్ని కృష్ణపట్నం పోర్టుతో అనుసంధానం చేసేలా శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఏడీబీ అధికారుల బృందం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. శ్రీకాళహస్తి నుంచి నడికుడి వరకూ 308 కిమీల మేర రైలు మార్గం నిర్మాణానికి రూ.1,500 కోట్లతో రైల్వేశాఖ ఇప్పటికే ప్రణాళిక రచించింది. ఈ రైలుమార్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో పూర్తిచేయడానికి 2012-13 బడ్జెట్లో అంగీకరించాయి.
కానీ.. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులను కేటాయించకపోవడం వల్ల ఆ రైలు మార్గం నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. అత్యంత ప్రధానమైన ఈ రైలుమార్గానికి ఇప్పటిదాకా రూ.1.76 కోట్లే ఖర్చు చేశారు. 2013-14 బడ్జెట్లో రూ.కోటి, 2014-15 బడ్జెట్లో రూ.ఐదు కోట్లను కేటాయించినా.. ఆ మేరకు కూడా నిధులను ఖర్చుచేయకపోవడం గమనార్హం. ఈ రైలుమార్గాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంటుంది.
చెన్నై-బెంగళూరు, తడ-పూతలపట్టు రహదారులను నాలుగు వరుసల రోడ్లుగా అభివృద్ధి చేయాలని ఏడీబీ అధికారుల బృందం ప్రతిపాదించింది. పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత ఆవశ్యకమైన జలాలు శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాంతంలో అందుబాటులో లేవు. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తే నిమ్జ్‌కు నీటి అవసరాలను తీర్చవచ్చు. శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాం తానికి సమీపంలోనే ఉన్న రేణిగుంట విమానాశ్రయా న్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని ఏడీబీ అధికారుల బృందం ప్రతిపాదించింది.
మౌలిక సదుపాయాలపై కసరత్తు ఏదీ?
శ్రీకాళహస్తి-ఏర్పేడు నిమ్జ్‌కు మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గానికి 2014-15 బడ్జెట్లో కేవలం రూ.ఐదు కోట్లను కేటాయించడమే అందుకు తార్కాణం. ఇక ఈ రైలు మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులుగా ఒక్క పైసాను కూడా కేటాయించకపోవడం గమనార్హం. పూతలపట్టు-తడ, చెన్నై-బెంగ ళూరు రోడ్లను నాలుగు వరుసల రహదారులుగా అభివృద్ధి చేసే పనులు సైతం నత్తనడక సాగుతున్నాయి.
రేణిగుంట విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేయాలంటే కనీసం రూ.1200 కోట్లు అవసరమని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు అంచనా వేశారు. కానీ.. ఆ విమానాశ్రయానికి రూ.150 కోట్లతో అంతర్జాతీయ హోదా కల్పించే పనులకు మాత్రమే 2010లో కేంద్రం అంగీకరించింది. పోనీ.. ఆ పనులైనా వేగంగా జరుగుతున్నాయా అంటే అదీ లేదు. అటవీశాఖ అనుమతులు లభించకపోవడం వల్ల సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులు ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం.