హత్యకు గురైన గృహిణి తహశీన్
మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణ నడిబొడ్డున ఓ మహిళ గురువారం రాత్రి దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు మహిళను అతి కిరాతకంగా గొంతుకోసి చంపారు. ఈ హత్య పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలో తీవ్ర కలకలం రేపిన ఈ దారుణ హత్యకు సంబంధించి డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి, టూటౌన్ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ విలేకర్లకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని తారకరామ సినిమా థియేటర్ వీధి (నర్సింగ్ హోం సందు)లో ఓ అద్దె ఇంటిలోని మూడో అంతస్థులో ముతవల్లి (మతగురువు) షేక్ అంజాద్, భార్య ఎస్.తహశీన్ (28) కాపురం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు తయూబ్(3), తలాల్(2), తాయూబ(1) ఉన్నారు. గురువారం ఇందిరానగర్‌లో ఉంటున్న అంజాద్ తల్లి పర్వీన్ తన కోడలు, మనవళ్లు, మనవరాలిని చూడటానికి ఇందిరానగర్ నుంచి వారి వద్దకు వచ్చింది. ఆమెను కొడుకు, కోడలు ఆ రోజంతా గౌరవంగా చూసుకున్నారు.
సాయంత్రం చీకటి పడగానే పర్వీన్ తిరిగి ఇందిరానగర్‌కు వెళ్లాలని కొడుకుకు చెప్పింది. వెంటనే ఆయన తన పిల్లలను ట్యూషన్‌లో వదిలి, తల్లిని తన ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని ఇందిరానగర్‌కు వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా తహశీన్‌ను ఎవరో కత్తితో గొంతుకోసి చంపారు. ట్యూషన్ పూర్తవగానే పిల్లలను ఇంటికి తీసుకొచ్చిన ఆయా, రక్తపు మడుగులో పడివున్న తహశీన్‌ను చూసి కేకలు పెట్టింది. స్థానికులు విషయాన్ని అంజాద్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. అదేవిధంగా 108కు ఫోన్ చేయడంతో సిబ్బంది గోపి, అమర అక్కడికి చేరుకున్నారు. తహశీన్‌ను పరిశీలించి, ఆమె మృతిచెందినట్లు తెలిపారు. కుమార్తె మరణవార్త తెలుసుకున్న తహశీన్ తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
హత్యపై అన్నీ అనుమానాలే..
తహశీన్ హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్య జరిగిన వెంటనే రక్తపుమరకలను తుడిపేయడానికి నిందితులు బకెట్‌తో నీళ్లు తెచ్చి జగ్గుతో కడిగే ప్రయత్నం చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అలాగే పెనుగులాటలో మహిళ కుడికాలి వెండి మెట్టె, మెడలోని బంగారు బొట్టు గొలుసు ఆమె మృతదేహానికి సమీపంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అంతే కాకుండా రక్తపు మరకలున్న కాళ్లతో నిందితులు ఇళ్లంతా తచ్చాడినట్లు స్పష్టమైన గుర్తులు కనిపిస్తున్నాయి. పడక గదికి ఆనుకుని ఉన్న బీరువా తెరచి రెండు మూడు చీరలు బయటకు తీసి కిందపడేసి వెళ్లినట్లు చిత్రీకరించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తలుపుకు గడియ పెట్టే చోట కూడా రక్తపు మరకలు అంటుకుని ఉండడంతో హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యను దొంగతనం చేయడానికి వచ్చిన దుండగులు చేసి ఉంటే, ఆమె కొత్త వ్యక్తులను చూడగానే కేకలు వేయడం, లేదా పెనుగులాడిన ఆనవాళ్లు గానీ, తోపులాట జరిగినట్లు గానీ కనిపించేదని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రాణాపాయం నుంచి బయటపడటానికి ఆపదలో ఉన్న ఎవరైనా పోరాడినట్లు కనిపించకపోవడంతో హత్యపై పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి.
కుటుంబ సభ్యుల పనేనా?
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ హత్య వెనుక కుటుంబ సభ్యుల హస్తమేమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు పాల్పడినవారు ఎంతటి వారైనా వదలిపెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారు. సంఘటనా స్థలంలో లభించిన కొన్ని కీలక ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment