ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చిత్తూరు: వేరుశనగ పంటను కోళ్లు నాశనం చేస్తున్నాయని సోమవారం రెండు వర్గాలు గొడవ పడ్డాయి. ఈ గొడవ తారాస్థాయికి చేరి కర్రలతో పరస్పర దాడులకు దిగడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు.. కురబలకోట మండలం, జంగావారిపల్లెకు చెందిన చిన్నారెడ్డి పెరటి కోళ్లు అదే ఊరికి చెందిన వెంకటరమణ వ్యవసాయ పొలంలోని శనగ పంటను నాశనం చేస్తున్నాయంటూ ఆయన కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం దూషించారు. అదే సమయంలో అటుగా పొలం వద్దకు వెళుతున్న రైతు చిన్నరెడ్డెప్ప(60) వారు తననే తిడుతున్నారని గొడవకు దిగాడు.
ఇరువురి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో వెంకటరమణ వర్గీయులు సుధాకర్(35) చిన్నరెడ్డెప్పపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడి విషయం తెలుసుకున్న చిన్నరెడ్డెప్ప కుటుంబ సభ్యులు రెడ్డిశేఖర్, మంగమ్మ, రత్నమ్మలు అక్కడికి చేరుకుని వారిపై ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాల దాడుల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి రలించారు. చిన్నరెడ్డెప్ప పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తిరుపతికి రెఫర్ చేశారు. వెంకటరమణ, సుధాకర్, రెడ్డిశేఖర్, మంగమ్మ, రత్నమ్మ మదనపల్లెలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment