వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులతో కలిసి సమైక్యవాదులు బుధవారం రహదారులపై కదం తొక్కారు. ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకోవడంతో బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపై కనుచూపు మేరలో వేలాది వాహనాలు కిలోమీటర్ల మేర ఆగిపోయాయి. అనంతపురంలోని తపోవనం వద్ద జైసమైక్యాంధ్ర.. జై జగన్ నినాదాలతో రహదారి హోరెత్తింది. చెన్నై రహదారిని దిగ్బంధించడంతో ఎస్కేయూ, ధర్మవరం, కదిరి వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రహదారుల దిగ్బంధాన్ని నిర్వీర్యం చేయడానికి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అనంతపురంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, కణేకల్లులో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
పలు చోట్ల ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అనంతపురంలో పలు ప్రైవేట్ స్కూళ్ల బస్సులు తిరగలేదు. హిందూపురంలో రోడ్డుపై టెంట్ వేసుకుని బైఠాయించారు. పుట్టపర్తి, కదిరి, విడపనకల్లులో రోడ్లపై వంటా వార్పు నిర్వహించారు. రహదారులపై గ్రామ గ్రామాన కంప, చెట్లు, లారీలు, ట్రాక్టర్లు అడ్డంగా ఉంచారు. రాయదుర్గంలో రోడ్డుపై పెద్దపెద్ద రాళ్లు అడ్డంగా ఉంచి నిరసన తెలిపారు. బత్తలపల్లి, కళ్యాణదుర్గంలో రాత్రి రోడ్డుపైనే పడుకున్నారు. కాగా, అంబులెన్స్ సైరన్ వినిపించగానే ఎక్కడికక్కడ పక్కకు తప్పుకుని దారి ఇచ్చారు.
సాక్షి, అనంతపురం : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ చేపట్టిన 48 గంటల రహదారుల దిగ్బంధం బుధవారం తొలిరోజు అనంతపురం జిల్లాలో విజయవంతమైంది. ఉదయం 8 గంటల నుంచే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికక్కడ దిగ్బంధం చేయడంతో రహదారులపై వాహనాలు బారులు తీరాయి. గుత్తి నుంచి కొడికొండ చెక్‌పోస్టు వరకు జాతీయ రహదారిపై పలుచోట్ల వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదంతొక్కడంతో ఆందోళనను నీరుగార్చడానికి పోలీసులు విఫలయత్నం చేశారు. అనంతపురం, శింగనమలలో పోలీసులు పార్టీ నాయకులు, కార్యకర్తలపై జులుం ప్రదర్శించారు. జిల్లా వ్యాప్తంగా 142 మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు.
అనంతపురంలో తపోవనం వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగడంతో వాహనాల రాకపోకలు కిలోమీటర్ల మేరకు స్తంభించిపోయాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, ఆందోళన విరమించాలని కోరారు. సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు ఉద్యమం ఆపేది లేదని ఎమ్మెల్యే చెప్పడంతో పోలీసులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే ఉన్నారని కూడా చూడకుండా పార్టీ శ్రేణులపై జులుం ప్రదర్శించారు.
సాయంత్రం 5గంటల సమయంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్‌పీరా, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు లింగాల రమేష్, నాయకులు బోయ తిరుపాలు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మలతో పాటు 100 మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి త్రీ టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాయదుర్గంలోని అనంతపురం, కణేకల్లు, బళ్లారి, మొలకాల్మూరు, బీటీపీ రోడ్లను దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కళ్యాణదుర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పేస్వామి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా.. పోలీసులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, మరో 13 మందిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఓడీ చెరువులో సమన్వయకర్త డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
గుంతకల్లులో సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ సర్కిల్‌లో 63వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి క్రాస్‌లో తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ పాల్గొన్నారు. పుట్లూరు వద్ద ఆలూరు సాంబశివారెడ్డి నాయకత్వంలో రోడ్లను దిగ్బంధించారు. శింగనమల, గార్లదిన్నె వద్ద ఆందోళనను అడ్డుకోవడానికి ఉదయం నుంచి ప్రయత్నాలు చేశారు. చివరకు సాయంత్రం నాలుగు గంటల సమయంలో బలవంతంగా నాయకులు, కార్యకర్తలను పక్కకు తోసివేశారు. ధర్మవరంలో ఉదయం 8 గంటలకే ప్రధాన రహదారులను దిగ్బంధించడంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. హిందూపురం సమన్వయకర్తలు ముగ్గురూ ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించారు. ఇనయతుల్లా ఆధ్వర్యంలో చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద, చౌళూరు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కిరికెర-బెంగళూరు రోడ్డులో, కొండూరు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకంఠాపురం సర్కిల్‌లో రోడ్లను దిగ్బంధించారు. గొట్లూరు-మొత్కుపల్లి రహదారిలో నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మడకశిర అంబేద్కర్ సర్కిల్‌లో కొంకల హనుమంతరాయ, వైబీ హళ్లి క్రాస్‌లో వైసీ గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కదిరిలో నియోజకవర్గ సమన్వయకర్త మహమ్మద్ షాకీర్, మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య, పార్టీ నాయకుడు జక్కల ఆదశేషు ఆధ్వర్యంలో 205 జాతీయ రహదారిపై బైఠాయించారు.
రోడ్డుపైనే వంటా-వార్పు చేపట్టడంతో ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాలు బారులు తీరాయి. యువజన నాయకుడు ఉపేంద్ర ఆధ్వర్యంలో స్థానిక వేమారెడ్డి కూడలిలో రోడ్డును దిగ్బంధించారు. ఉరవకొండలో కిసాన్‌సెల్ కర్నూలు, అనంతపురం జిల్లాల కన్వీనర్ వై.మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం-బళ్లారి బైపాస్ రోడ్డు, ఉరవకొండ-గుంతకల్లు, కణేకల్లు రహదారులను దిగ్బంధించారు. రోడ్డు పైనే వంటావార్పు నిర్వహించి.. సహపంక్తి భోజనాలు చేశారు. రోడ్డుపై క్రికెట్, ఖోఖో ఆడి నిరసన తెలిపారు.
వాహనాలు బారులు తీరడంతో ఆందోళన విరమించాలని పోలీసులు సూచించగా.. ఆందోళనకారులు ససేమిరా అన్నారు. దీంతో మధుసూదన్‌రెడ్డితో పాటు 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రిలో సమన్వయకర్త వీఆర్.రామిరెడ్డి, సీఈసీ సభ్యుడు పైలా న ర్సింహయ్య అధ్వర్యంలో రాయలచెరువు, మిడుతూరు, బొందలదిన్నె, వెంకటరెడ్డిపల్లి, ముచ్చుకోట రహదారులను దిగ్బంధం చేశారు. పెనుకొండలో జాతీయ రహదారిపై సమన్వయకర్త సానిపల్లి మంగమ్మ ఆధ్వర్యంలో వాహనాలను అడ్డుకున్నారు. పామిడి వద్ద నిర్వహించిన రాస్తారోకోలో రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కదిరి సమన్వయకర్త ఇస్మాయిల్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు పాల్గొన్నారు.
దద్దరిల్లిన రహదారులు
Published Thu, Nov 7 2013 2:53 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement