రవికిరణ్ ను పరామర్శించిన విజయ సాయిరెడ్డి
గుంటూరు సబ్‌జైల్లో ఉన్న పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్‌ను మంగళవారం మధ్యాహ్నం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్షసాధింపు చర‍్యల‍్లో భాగంగానే రవికురణ్‌ను చంద్రబాబు సర్కార్ అరెస్టుచేసి జైల‍్లో పెట్టిందని ఆరోపించారు. రవికిరణ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వంపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే సోషల్ మీడియాలో జనం స్పందిస్తున్నారన్నారు.
తమపై టీడీపీ పార్టీ వాళ్లు చాలా కార్టున్లు వేశారని, మరి వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని విజయ సాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. పత్రికల‍్లో, సోషియల్ మీడియాలో వచ్చే కార్టూన‍్లలో వ‍్యంగం సహజమని, మిగతావారిని కూడా ఇలాగే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి కొమ‍్ముకాస్తూ అమాయకులను అరెస్టు చేస్తున్నారని ధ‍్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెట్టినవారిని వదలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. కాగా విజయ సాయిరెడ్డితో పాటు పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, ఆత్కూరు ఆంజనేయులు ఉన్నారు.