హైదరాబాదీ స్టార్టప్స్ జిగేల్!
స్టార్టప్ స్ట్రీట్
సాక్షి , బిజినెస్ విభాగం: అక్షరాలా నలభైమూడు మిలియన్ డాలర్లు. అంటే మన రూపాయల్లో దాదాపు 258 కోట్లు. ఇదంతా గతేడాది మన హైదరాబాదీ కంపెనీల్లోకి వచ్చిన నిధుల మొత్తం. హైదరాబాదీ కంపెనీలంటే ఇవేమీ పెద్ద పెద్ద సంస్థలో, ఎన్నో సంవత్సరాల కిందట ఆరంభించినవో కావు. ఇవన్నీ స్టార్టప్‌లే.
దాదాపు 12 సంస్థల్లోకి ఈ 258 కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయి. అంటే సగటున ప్రతి సంస్థలోకీ 24 కోట్ల రూపాయలకు పైనే వచ్చాయన్న మాట. ఇలా పెట్టుబడులు సమీకరించిన సంస్థల్లో ఇంటర్నెట్ టెలివిజన్ ప్రసారాల సంస్థ యప్ టీవీ, జిపర్, మై స్మార్ట్ ప్రైస్, హెలో కర్రీ వంటి ఇంటర్నెట్ స్టార్టప్‌లు ఉన్నాయి. కన్జూమర్ ఇంటర్నెట్, సర్వీసులు, హెల్త్‌కేర్ విభాగంలో తలో మూడు స్టార్టప్ కంపెనీలు ఫండింగ్ దక్కించుకోవటం గమనార్హం.
అత్యధిక నిధుల విషయానికొస్తే హార్డ్‌వేర్ సంస్థ ఇనెడా సిస్టమ్స్ 19 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.120 కోట్లు), హెల్త్‌కేర్ రంగానికి చెందిన నెఫ్రోప్లస్ 10 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.60 కోట్లు) , డెంటీస్.. ఇంటెలిగ్రో చెరి 4.5 మిలియన్ డాలర్లు (తలా రూ.27 కోట్లు) దక్కించుకున్నాయి. కార్యకలాపాల కేంద్రాన్ని బట్టి చాలా మంది ఇన్వెస్టర్లు స్థానికంగా ఉండే సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడానికే మొగ్గు చూపారు. ఎందుకంటే స్థానిక పరిస్థితులపై అవగాహన ఉంటుంది కనుక సదరు వ్యాపారం సక్సెస్‌ను అంచనా వేయగలుగుతున్నామన్నది వీరి ఉద్దేశం. అందుకే అత్యధిక ఇన్వెస్టర్లు బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబైలలో ఉండటం అక్కడి స్టార్టప్స్‌కి లాభించింది.
బయటే ఇన్వెస్ట్ చేసిన హైదరాబాదీలు...
2014లో దేశీయ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడుల డేటా ప్రకారం... మిగిలిన ప్రాంతాల వారికి భిన్నంగా హైదరాబాద్‌కి చెందిన ఇన్వెస్టర్లు ఒకరిద్దరు మినహా మిగతా వారంతా వేరే ప్రాంతాల స్టార్టప్స్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. హైదరాబాద్‌కి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల్లో మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్, శ్రీ క్యాపిటల్, హైదరాబాద్ ఏంజెల్స్, పీపుల్ క్యాపిటల్ పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశాయి.
శ్రీ క్యాపిటల్ సంస్థ.. స్థానిక కంపెనీలైన యప్‌టీవీ, హెలోకర్రీలో 3 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. మిగతా మూడు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలూ ఎక్కువగా న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరుకి చెందిన స్టార్టప్స్‌పై దృష్టి పెట్టాయి. పీపుల్ క్యాపిటల్ అత్యధికంగా... న్యూఢిల్లీకి చెందిన ఈకామ్ ఎక్స్‌ప్రెస్‌లో 16.5 మిలియన్ డాలర్ల మేర, ముంబైకి చెందిన ఎంస్వైప్‌లో మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్ 10-15 మిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయి.