భారత్ నుంచి ఇంద్రా నూయి ఒక్కరే...
‘ఫార్చ్యూన్’ ప్రపంచ శక్తివంత వ్యాపార మహిళల జాబితాలో రెండో స్థానం
న్యూయార్క్: పెప్సికో సీఈవో ఇంద్రా నూయి.. భారత్ నుంచి ‘ఫార్చ్యూన్ 50 మంది శక్తివంతమైన వ్యాపార మహిళల’ జాబితాలో స్థానం దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయురాలు. ఫార్చ్యూన్ జాబితాలో జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బర్రా అగ్రస్థానంలో ఉంటే, ఇంద్రా నూయి రెండో స్థానంలో ఉన్నారు. గతేడాది కంపెనీ 4 శాతం రెవెన్యూ వృద్ధిని ప్రకటించడంలో ఇంద్రా నూయి కీలక పాత్ర పోషించారు. గతేడాది ఇదే జాబితాలో ఆమె మూడో స్థానంలో ఉండేవారు.
ఈ జాబితాలో ఐబీఎం సీఈవో గిన్ని రోమెట్టీ (3వ స్థానం), ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ (8వ స్థానం), యాహూ సీఈవో మరిస్సా మేయర్ (18వ స్థానం) తదితరులు ఉన్నారు. 2015 సంవత్సరానికి ఫార్చ్యూన్ విడుదల చేసిన ఉత్తమ ఔత్సాహిక మహిళావ్యాపారవేత్తల జాబితాలో భారత సంతతికి చెందిన పాయల్ కడాకియా స్థానం దక్కించుకున్నారు. ఆమె ఫిట్‌నెస్ తరగ తుల సేవలందించే ‘క్లాస్‌పాస్’ సహ వ్యవస్థాపకులు. ఈ స్టార్టప్ కంపెనీని ప్రారంభించి రెండేళ్లయ్యింది. అమెరికా, కెనడా, బ్రిటన్‌లలో ఫిట్‌నెస్ జిమ్‌లు, బాటిక్‌లకు వినియోగదారుల్ని ఈ క్లాస్‌పాస్ అనుసంధానిస్తుంది.