వావ్‌... ఒకటో తేదీ! | Investment in Mutual funds | Sakshi
Sakshi News home page

వావ్‌... ఒకటో తేదీ!

Published Mon, Oct 23 2017 1:11 AM | Last Updated on Mon, Oct 23 2017 4:04 AM

Investment in Mutual funds

శ్రీహరి, సురేందర్‌ ఇద్దరూ చక్కని ఇన్వెస్టర్లే. ఒకోసారి మ్యూచువల్‌ ఫండ్స్‌లో, ఒకోసారి తామే స్వయంగా ఎంచుకున్న స్టాక్స్‌లో... ఇలా రకరకాలుగా ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. కాకపోతే ఇద్దరి మధ్యా ప్రాథమికమైన తేడా ఒకటుంది. శ్రీహరి ప్రతినెలా ఒకటవ తేదీ కాగానే... తన బ్యాంకు ఖాతాలో పడ్డ జీతం నుంచి ఇన్వెస్ట్‌మెంట్లకు సరిపడా మొత్తాన్ని అప్పటికప్పుడే మళ్లించేస్తూ ఉంటాడు. సురేందర్‌ మాత్రం నెలలో ఎప్పుడో ఒకప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మళ్లించాలనే నియమం పెట్టుకున్నాడు. సహజంగా నెలాఖర్లో చేస్తే మంచిదని, తన ఖర్చులు పోను మిగిలినదెంతో తెలుస్తుంది కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్‌ ఈజీ అని భావిస్తుంటాడు. ఇద్దరిదీ ఒకే ఆఫీసు, ఒకేరకమైన జీతం– జీవితం కావటంతో... ఒకసారి ఇద్దరి చర్చా ఇన్వెస్ట్‌మెంట్లపైకి మళ్లింది. ఇద్దరూ పదేళ్ల కిందట ఇన్వెస్ట్‌మెంట్‌ మొదలుపెట్టగా...

‘‘నీ ఇన్వెస్ట్‌మెంట్లు ఇపుడు ఎంతయి ఉండొచ్చు హరీ?’’ అని అడిగాడు సురేందర్‌. అప్పటికప్పుడు తన మొబైల్లో పోర్ట్‌ఫోలియోను చూసుకున్న శ్రీహరి.. ‘‘దాదాపు 18 లక్షలపైనే ఉంది’’ అని చెప్పాడు. సురేందర్‌ తన పోర్ట్‌ఫోలియో కూడా చూసుకున్నాడు. అది దాదాపు 13 లక్షలుంది. ‘‘అరె! ఇంత తేడా ఉందే?’’ అని ఆశ్చర్యపోయాడు. అదే ప్రశ్న హరిని కూడా అడిగాడు. ‘‘నేను ప్రతినెలా 1వ తేదీన ఇన్వెస్ట్‌ చేస్తా! మరి నువ్వు?’’ అని ప్రశ్నించాడు శ్రీహరి. ‘‘నేను నెలలో ఏదో ఒక తేదీలో చేస్తుంటాను. ఎప్పుడైనా ఆ నెల కుదరకపోతే మానేస్తా. అందుకని.. ఇంత తేడా ఉంటుందా?’’ అన్నాడు సురేందర్‌. అప్పుడు ఒకటో తేదీ మహాత్మ్యం గురించి చెప్పటం మొదలెట్టాడు శ్రీహరి. అదేంటో మనమూ చూద్దాం...

‘‘నెలాఖర్లో స్వయంగా ఇన్వెస్ట్‌ చేయడమనేది నిజంగా చాలా సులభమైన ప్రక్రియ. ఎందుకంటే అప్పటికే ఆ నెలకు సంబంధించి అన్ని అవసరాలకు ఏర్పాట్లు జరిగిపోయి ఉంటాయి. ఎంత మిగిలిందో స్పష్టంగా తెలిసిపోతుంది. అదే ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. చాలామంది చేసే పని ఇదే. కాకపోతే,  దీనికన్నా నెల మొదట్లోనే ఆటోమోడ్‌లో బ్యాంకు ఖాతా నుంచి ఇన్వెస్ట్‌మెంట్‌కు నిధులు తరలివెళ్లేలా ఏర్పాటు చేసుకోవడం వల్ల లాభమెక్కువ.


పక్కా ప్రణాళిక తప్పనిసరి...
ప్రతి నెలా మొదట్లోనే ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలైన మార్గం ఒకటుంది. అదేంటంటే... ప్రతి నెలా మన అవసరాలన్నిటికీ ఎంత నిధి కావాలో మొదట తేల్చుకోవాలి. దానికి అదనంగా మరో 10 శాతం కలిపి బ్యాంకు ఖాతాలో ఉంచుకోవాలి. ఆ తర్వాత మన సంపాదనలో మిగులంతా ఇన్వెస్ట్‌మెంట్‌కు వెళ్లిపోవాలి. ఉదాహరణకు శ్రీనాథ్‌ అనే వ్యక్తి ఏం చేశాడో చూద్దాం. శ్రీనాథ్‌ నెల వేతనం రూ.50,000. కానీ నెల చివరికి వచ్చేసరికి తన ఖాతాలో రూపాయి మిగలడం లేదు.

అతడి కుటుంబ పోషణ, ఇతర అవసరాలను ఓ పేపర్‌పై పెట్టి చూస్తే ప్రతీ నెలా ఖర్చులకు రూ.35,000 అవసరమని తేలింది. అంటే మిగిలిన రూ.15,000 దుబారా అవుతున్నాయని ఇక్కడ తెలుస్తోంది. ఇటువంటప్పుడు శ్రీనాథ్‌ ప్రతీ నెలా 35,000+10 శాతం మార్జిన్‌ మనీ అనుకుంటే 3,500 కలిపి రూ.38,500ను నెలవారీ అవసరాల కోసం పక్కన పెట్టాలి.

మిగిలిన రూ.11,500 సిప్‌ రూపంలో ఒకటో తేదీనే ఇన్వెస్ట్‌మెంట్‌కు పంపేయాలి. శ్రీనాథ్‌ 10 శాతం మార్జిన్‌ మనీగా ఉంచిన రూ.3,500 గనక ఒకవేళ ఖర్చు కాకుండా ఉంటే మరుసటి నెలలో దాన్ని అత్యవసర నిధికి మళ్లించుకోవాలి. ఇలా చేయడం వల్ల అనవసర ఖర్చులకు కళ్లెం వేయడం, ఇన్వెస్ట్‌ చేయడం రెండూ నెరవేరతాయి.


పొదుపునకు దారి...
మొబైల్స్, గ్యాడ్జెట్లు, పార్టీలు, ప్రయాణాలు ఇలా ఎన్నో రూపాల్లో సంపాదనంతా ఖర్చు పెట్టేసే ధోరణి పెరిగిపోతోంది. దీనికి అలవాటు పడ్డామా ఆర్థికంగా ముందడుగు వేయటం కష్టమవుతుంది. అందుకే ముందు ఇంటి కోసం బడ్జెట్‌ వేసుకుని... అవసరాలకు సరిపడినంతే ఉంచుకుని, మిగులు నిధులను ఒకటో తేదీనే పెట్టుబడికి తరలించడం చేయాలి. ఇది చేసి పెట్టేదే సిప్‌. ఈ అలవాటు ప్రారంభంలో కష్టమే అనిపించొచ్చు. ఆచరించడం మొదలు పెడితే సులభంగా మారిపోతుంది. అంతేకాదు ఒకటో తారీఖే ఇన్వెస్ట్‌మెంట్‌ పూర్తయిపోతే ఇక నెలంతా ఉన్న నిధులతో స్వేచ్ఛగా వ్యవహరించొచ్చు.


క్రమశిక్షణ అలవాటవుతుంది...
ఉదాహరణకు మనం ప్రతినెలా చివర్లో రూ.10,000 చొప్పున పదేళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలని అనుకున్నామంటే... అది అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాకపోవచ్చు. కొన్ని సార్లు పెట్టుబడిని వాయిదా వేయాల్సి రావచ్చు. కొన్ని సార్లు ఓ వారం ఆగి మళ్లీ వేతనం వచ్చిన తర్వాత మళ్లిద్దాంలే! అనుకునే సందర్భాలూ ఉంటాయి.

కొన్ని సందర్భాల్లో ఖర్చుల కారణంగా ఆ నెలకు మానేయాల్సి రావచ్చు కూడా. మొత్తమ్మీద చాలా సార్లు ఇన్వెస్ట్‌మెంట్‌ సాధ్యం కాదు. దానికి బదులు ఒకటో తేదీన ఆటోమోడ్‌లో ఆ మొత్తం సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానంలో బ్యాంకు ఖాతా నుంచే వెళ్లేలా ఆప్షన్‌ ఎంచుకోవాలి. వేతనం జమ అయిన వెంటనే మనం ఎంచుకున్న తేదీన పెట్టుబడి మొత్తం బ్యాంకు ఖాతా నుంచి మినహాయించేస్తారు. ఇందులో మన జోక్యం ఏమీ ఉండదు.

కానీ, ఇన్వెస్ట్‌మెంట్‌ జరిగిపోతుంది. కాకపోతే, చాలా మంది సిప్‌కు ఓకే చెప్పినా ఆటోమోడ్‌ను ఎంచుకోరు. తామే నిర్ణీత తేదీన ఇన్వెస్ట్‌ చేయొచ్చునని అనుకుంటుంటారు. కానీ, ఎంత క్రమశిక్షణాపరులైనా గానీ దీన్ని అమలు చేయడం కష్టమే. ఎందుకంటే అధిక ఖర్చులు దీనికి విఘ్నం కలిగించొచ్చు. లేదా క్రమశిక్షణ లోపించొచ్చు. కారణమేదైనా గానీ చివరికి నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే సిప్‌ను ఎంచుకుని, ఆటోమోడ్‌లో నిధులు పంపించటాన్ని పెట్టుబడుల్లో విజయానికి తొలి అడుగుగా భావించాలి.


అనవసర వ్యయాలుంటాయి...
సరఫరా అనేది డిమాండ్‌ను సృష్టిస్తుందనేది ఆర్థిక సూత్రం. దీన్ని సగటు వ్యక్తులకు అన్వయించి చూస్తే... బ్యాంకు ఖాతాలో మిగులు నిధులు ఉంటే వాటిని ఖాళీ చేసేందుకు కావాల్సినన్ని అవసరాలు కళ్ల ముందు కనిపిస్తాయి. ఇలా కాకుండా ముందు పెట్టుబడి పెట్టాకే ఏదైనా అన్న సూత్రాన్ని ఫాలో అయ్యామనుకోండి.

ఫలితాలు కళ్ల ముందుంటాయి. అవసరాలు తీరిన తర్వాతే ఇన్వెస్ట్‌మెంట్‌ అని నెల చివర ముహూర్తం పెట్టుకున్నామనుకోండి. మనలో సంకల్పం ఉన్నా నెల చివరికి వచ్చే సరికి బ్యాంకు ఖాతాలో నిధులేవీ మిగిలి ఉండవు మరి! ఎందుకంటే మన ప్రథమ ప్రాధాన్యం ఖర్చులు, అవసరాలు. అందుకే ఇలా జరగకుండా ఉండటానికే ప్రతి నెలా బ్యాంకు ఖాతాలో వేతనం పడటం ఆలస్యం... దాన్ని మనం చూసేలోగానే అందులోంచి ఇన్వెస్ట్‌మెంట్‌ భాగం డిడక్ట్‌ అయిపోయేలా ప్రణాళిక ఉండాలి.


రిస్క్‌ కూడా తక్కువే
ప్రతి నెలా సిప్‌ విధానంలో దీర్ఘకాలం పాటు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల రిస్క్‌ తగ్గుతుంది. మార్కెట్లు బుల్‌ దశలో ఉన్నా, బేర్‌ దశలో ఉన్నా మన ఇన్వెస్ట్‌మెంట్లు కొనసాగుతాయి. దాంతో ఇన్వెస్ట్‌మెంట్‌ సగటుగా మారి కొనుగోలు ధర తగ్గుతుంది. రాబడులు అధికంగా ఉంటాయి. రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడని వారు సిప్‌ విధానంలో ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు.

ఉదాహరణకు శ్రీనాథ్, రామ్‌నాథ్‌ మంచి స్నేహితులు. పన్ను ఆదా కోసం ఇద్దరూ ఏడాదిలో సెక్షన్‌ 80సీ కింద ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకున్నారు. నిర్ణయించుకున్నారు. శ్రీనాథ్‌ ఫిబ్రవరిలో ఏక మొత్తంలో రూ.1,50,000 ఇన్వెస్ట్‌ చేయగా, రామ్‌నాథ్‌ మాత్రం ఏప్రిల్‌ నుంచి ప్రతినెలా 12,500 చొప్పున ఈఎల్‌ఎస్‌ఎస్‌లో సిప్‌ చేశాడు.

ఒక్కో యూనిట్‌ మార్కెట్‌ ధర శ్రీనాథ్‌ కొన్నప్పుడు రూ.50గా ఉండగా, రామ్‌నాథ్‌ ఏడాది పాటు ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లాడు కనుక కొన్ని సందర్భాల్లో ఆయనకు యూనిట్‌ రూ.41కి కూడా లభించింది. దీంతో సగటున ఒక్కో యూనిట్‌ రూ.44కే లభించింది. ఇద్దరి మధ్య పెట్టుబడుల విలువలో ఇది చెప్పుకోతగ్గ వ్యత్యాసం తీసుకొచ్చింది’’ అంటూ ముగించాడు శ్రీహరి.


ముందుగా మొదలెట్టేయాలి...
శ్రీహరి, సురేందర్‌ పెట్టుబడుల్లో అంత తేడా ఎందుకొచ్చిందో తెలిసిందిగా!! అదంతా ఒకటో తేదీ మహాత్మ్యం. సిప్‌ చేసిన గమ్మత్తు. అందుకని మీరు కూడా వెంటనే నెల బడ్జెట్‌ వేసుకుని మిగులు నిధులను మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో సిప్‌ రూపంలోకి ఒకటో తేదీనే వెళ్లేలా ప్లాన్‌ చేసుకుంటే బెటర్‌! దీర్ఘకాలంలో ఎక్కువ సంపద సృష్టించే అవకాశం ఉంటుంది!! బెస్టాఫ్‌ లక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement