విల్లు.. వీలున్నపుడు కాదు!! | Legacy Asset | Sakshi
Sakshi News home page

విల్లు.. వీలున్నపుడు కాదు!!

Published Mon, Feb 20 2017 12:58 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

విల్లు.. వీలున్నపుడు కాదు!!

విల్లు.. వీలున్నపుడు కాదు!!

మీ ఆస్తులు, ఆకాంక్షలకు నిలువుటద్దమది l
వారసుల మధ్య స్పర్ధలు రాకుండా చూస్తుంది
ఆస్తులున్నవారు తప్పనిసరిగా రాయాల్సిందే


విల్లు. వీలునామాగా అందరికీ తెలిసిందే. నిజానికిది మీ ఆస్తులను సంరక్షించే న్యాయపరమైన పత్రం. ఆస్తి వారసత్వంగా ఎవరికి దక్కాలన్న ప్రక్రియ దీన్లో ఉంటుంది. దీనిపై కొంత అవగాహన కలిగించేదే ఈ కథనం.

ఆర్థిక లక్ష్యాల్లో భాగం కావాలి...
మధ్య వయసు నుంచీ ప్రతి సంవత్సరం మనం ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంటుంటాం. ఇలాంటి సందర్భాల్లో మన సంపద మన తరువాత ఎవరికి ఎంత దక్కాలన్నది ముందుగా నిర్ణయించుకోవడం ముఖ్యం. ముఖ్యంగా మీ కష్టార్జితం... మీ తరువాత కుటుంబ సంక్షేమం దృష్ట్యా ఒక బాధ్యతాయుతమైన కుటుంబ వ్యక్తి చేతుల్లో ఉండాలనుకోవడం ఎంతమాత్రం తప్పుకాదు. మీ తరువాత కుటుంబంలో బాధ్యతలేని ఒక వ్యక్తికి మీ ఆస్తి దక్కకూడదు కదా!.

కుటుంబంలో విభేదాల నివారణకు...
ఎవరెవరికి ఎంతెంత సొమ్ము దక్కాలని రాసుకోవడంతోపాటు, మీ దగ్గర ఎంత డబ్బు... ఎంత బంగారం... ఎంత ఆస్తి ఉందన్న విషయం కుటుంబ సభ్యులందరికీ తప్పనిసరిగా తెలియాలి. లేదంటే... మీ తరువాత వారు ఒకరినొకరు మోసం చేసుకోడానికో లేదా వారి మధ్య మనస్పర్థలు తలెత్తడానికో కూడా అవకాశం ఉంటుంది.

రిజిస్ట్రేషన్‌ అక్కర్లేదు...
ఆస్తి అమ్మకం ఒప్పందం వంటి కొన్ని పత్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయాలి. విల్లుకు మాత్రం ఇటువంటి రిజిస్ట్రేషన్‌ అక్కర్లేదు.  రిజిస్ట్రేషన్‌ వల్ల విల్లుకు కొంత విలువ పెరుగుతుంది కానీ, అది పూర్తిస్థాయిలో కాదు. ఇక్కడ విల్లు ఏ పరిస్థితుల్లో రాశారనే అంశం విచారణకు లోబడి ఉంటుంది. న్యాయపరమైన అంశాలను అక్కడితో వదిలేస్తే.. ఒకసారి విల్లు రాశాక కావాలనుకుంటే... దాన్ని మార్చి మరొక విల్లు రాయవచ్చు. అయితే మొదటి విల్లును రిజిస్టర్‌ చేస్తే, రెండవ విల్లునూ తిరిగి రిజిస్టర్‌ చేయాలి. లేదంటే అదంటే రెండవ విల్లుకు విలువ తగ్గుతుంది.

 మీ డబ్బు వృథా కాకూడదు..
కొందరు బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్‌ చేస్తారు. వారి వారసులెవరికీ ఈ విషయాలు చెప్పరు. వారి వారసులు సైతం ఎవరి పని ఒత్తిడిలో వారు ఉండి... ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు. ఏంటీ? తల్లిదండ్రుల వద్ద ఎంత డబ్బు ఉందీ పిల్లలకు తెలియదా? అని ఇక్కడ అనుకుంటే అనుకోవచ్చుగానీ, బ్యాంకులు, ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ ఓ), పీపీఎఫ్, ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్ద క్లెయిమ్‌ చేయని డబ్బు ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. దాదాపు రూ. 64,000 కోట్లు. ఇది ఇటీవల డీమోనిటైజేషన్‌ వల్ల ప్రభుత్వానికి మిగిలిందని భావిస్తున్నదానికన్నా ఎక్కువ కావ డం గమనార్హం. అన్‌క్లెయిమ్డ్‌ డబ్బంటే.. ఒక వ్యక్తి కష్టార్జితం ఆ వ్యక్తి కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు ఎంతమాత్రం వినియోగపడనిదే. అంతెందుకు బ్యాంకులో ఒక వ్యక్తి సేవింగ్స్‌ అకౌం ట్లలో మొత్తాన్ని ఆ వ్యక్తి తరువాత అసలు క్లైమ్‌ చేయని ఉదంతాలు ఎన్నో ఉంటాయి.

అర్హతలూ అవసరం..
భారత వారసత్వ చట్టం, 1925 విల్లు స్వరూప స్వభావాలను వివరిస్తుంది. విల్లురాసే వ్యక్తి మేజర్‌గా ఉండి మానసికంగా పూర్తి సామర్థ్యంతో ఉండాలి. తన ఆస్తుల పట్ల పూర్తి పరిజ్ఞానంతో వివరాలు చెప్పాలి. ఎవరి, ఎటువంటి ప్రభావాలకు లోనై విల్లు రాసినట్లు ఉండరాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. విల్లుపై రాసే వ్యక్తి, ఇరువురి సాక్షి సంతకాలు అవసరం. విల్లు సాధారణంగా పేపర్‌మీద రాయాల్సి ఉంటుందికానీ, త్రివిధ దళాల సైనిక సేవల్లో ఉన్నవారు ప్రాణాపాయ పరిస్థితుల్లో.. ఇరువురు సాక్షుల సమక్షంలో మౌఖికంగా చెప్చొ చ్చు. అయితే ఆ తర్వాత సంబంధిత వ్యక్తి జీవించే ఉంటే, నెల రోజుల తర్వాత విల్లు చెల్లదు.  

విల్లే సుప్రీం...
బ్యాంక్‌ అకౌంట్లు, మ్యూచువల్‌ ఫండ్స్, బీమా పాలసీ సెటిల్‌మెంట్లు, పోస్టాఫీస్‌ సేవింగ్స్, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్స్‌ వంటి ఫైనాన్షియల్‌ ప్రొడక్టులకు సంబంధించి నామినీలు సంబంధిత సొమ్ముకు కేవలం ట్రస్టీలే. ఉదాహరణకు ‘ఏ’ అనే వ్యక్తి బ్యాంకులో కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేశాడు. ‘బీ’ అనే వ్యక్తిని నామినీగా రాశాడు. ఇక్కడ ‘ఏ’ డిపాజిట్‌కు ‘బీ’ ట్రస్టీ మాత్రమే. ‘ఏ’ మరణించిన వెంటనే ‘బీ’కి ఆ డిపాజిట్‌ సొమ్ము తనంతటతానుగా రాదు. ‘ఏ’ ఒకవేళ ఏదైనా వీలునామా రాసి, ఆ వీలునామాలో సంబంధిత డిపాజిట్‌ మొత్తం ‘సీ’కు చెందుతుందని రాస్తే... ‘సీ’ మాత్రమే దీనికి వారసుడు. ఎటువంటి విల్లు రాయకపోతే, డిపాజిట్‌ సొమ్ము న్యాయపరమైన వారసులకే చెందుతుంది. ఇక కొన్ని ఫైనాన్షియల్‌ ప్రొడక్టుల విషయంలో ‘నామినీ’ కాలమ్‌ ఉండదు. ఇక్కడ ఆయా సొమ్ము వారసులకు అందడానికి ‘వీలునామా’నే మార్గం. చివరిగా ఈ కథనం విల్లుకు సంబంధించి ఒక అవగాహనకు మాత్రమే. మరిన్ని వివరాలకు, సందేహాల నివృత్తికి న్యాయవాదిని సంప్రదించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement