గత వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ స్వల్పకాలిక చలన సగటులు 20 డీఎంఏ, 50 డీఎంఏ ప్రకారం బుల్లిష్ వేవ్‌ను సూచించినట్లు నార్నోలియా ఫైనాన్షియల్ టెక్నికల్, డెరివేటివ్ రీసెర్చ్ హెడ్ షబ్బీర్ కయూమీ పేర్కొన్నారు. అయితే నిఫ్టీ 9,200 పాయింట్ల ఎగువకు చేరాక.. ఆ స్థాయిలో నిలదొక్కుకోవలసి ఉన్నట్లు తెలియజేశారు. ఫలితంగా నిఫ్టీ స్వల్పకాలంలో 9,550కు చేరే వీలున్నట్లు అంచనా వేశారు. ఈ సందర్భంగా స్వల్ప కాలానికి మూడు స్టాక్స్‌ను పెట్టుబడికి అనువైనవిగా సూచిస్తున్నారు. ఇతర వివరాలు చూద్దాం..
నీరసిస్తే
గత వారం నిఫ్టీ 9200-8800 శ్రేణిలో కన్సాలిడేట్ అయ్యింది. దీంతో 50 డీఎంఏ ఎగువన నిలదొక్కుకోలేకపోయింది. గరిష్ట స్థాయిలవద్ద అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు బేరిష్ క్యాండిల్ స్టిక్ సూచిస్తోంది. దీంతో ఇకపై నిఫ్టీ ఒకవేళ బలహీనపడితే.. తొలుత 8750 పాయింట్ల వద్ద, తదుపరి 8650 స్థాయిలోనూ సపోర్ట్ లభించే వీలుంది. ఈ స్థాయి దిగువకు చేరితే అమ్మకాలు ఊపందుకోవచ్చు. ఫలితంగా 8,300 పాయింట్ల వరకూ క్షీణించే అవకాశముంది. అయితే గత వారం 20 డీఎంఏ, 50 డీఎంఏను అధిగమించడంతో కొంతమేర సానుకూల ధోరణితో సైడ్‌వేస్ కదలికలకు ఆస్కారం ఉంది. తద్వారా 9,200 పాయింట్లను అధిగమించి నిఫ్టీ నిలదొక్కుకుంటే మరింత బలపడేందుకు చాన్స్ ఉంటుంది. రానున్న కాలంలో నిఫ్టీ గరిష్టంగా 9,550ను తాకవచ్చని భావిస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ.. గత వారమంతా బలహీనంగానే ట్రేడయ్యింది. కీలక మద్దతు స్థాయిల దిగువన ముగిసింది. చార్టుల ప్రకారం నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ప్రతికూలంగా కనిపిస్తోంది. అయితే 18,000 ఎగువకు చేరితే బ్యాంక్ నిఫ్టీ పుంజుకునే వీలుంది. సాంకేతికంగా బ్యాంక్ స్టాక్స్‌లో కొన్ని కౌంటర్లు రివర్సల్‌ను సూచిస్తున్నాయి. ఇది బ్యాంక్ నిఫ్టీకి కొంతమేర మద్దతు పలికే అవకాశముంది. కాగా.. స్వల్ప కాలానికి మూడు కౌంటర్లు కొనుగోలుకి అనుకూలంగా కనిపిస్తున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్
ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ షేరుని రూ. 340 టార్గెట్‌తో రూ. 280 ప్రాంతంలో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ. 240 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకోవలసి ఉంటుంది. రోజువారీ చార్టుల ప్రకారం ఈ కౌంటర్లో డబుల్ బాటమ్ ప్రైస్ ప్యాటర్న్ ఏర్పడింది. ప్రధాన మద్దతు స్థాయిని నిలుపుకుంటే స్వల్ప కన్సాలిడేషన్ తదుపరి బలపడే వీలుంది. ఆర్‌ఎస్‌ఐ సానుకూల సంకేతాలు ఇస్తోంది. ఎంఏసీడీ సైతం ఈ కౌంటర్ పుంజుకోవచ్చని సూచిస్తోంది.
టీవీఎస్ మోటార్ కంపెనీ
ఆటో రంగ దేశీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ షేరుని రూ. 350 టార్గెట్‌తో రూ. 305 సమీపంలో కొనుగోలు చేయవచ్చు. రూ. 280 వద్ద స్టాప్‌లాస్ అమలు చేయవలసి ఉంటుంది. రోజువారీ చార్టుల ప్రకారం ఈ కౌంటర్‌లో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగినట్లు తోస్తోంది. కనిష్ట స్థాయిల నుంచి రీబౌండ్ అవుతోంది. ఇకపై మరింత పుంజుకునే అవకాశముంది. ఈ కౌంటర్లో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరుగుతోంది.
కొటక్ మహీంద్రా బ్యాంక్
గత కొద్ది రోజులుగా ఈ కౌంటర్లో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. అయితే రూ. 1115-1125 వద్ద డిమాండ్ కనిపించడంతో ఈ స్థాయిలలో మద్దతు లభిస్తోంది. ఈ స్థాయిలో పటిష్ట బేస్ ఏర్పడినట్లు వారపు చార్టులు సూచిస్తున్నాయి. రోజువారీ చార్టుల ప్రకారం చూస్తే డబుల్ బేస్ ఏర్పడింది. వెరసి సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇకపై ఈ కౌంటర్ మరింత జోరందుకోవచ్చని భావిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment