కొరియా కల్లోలం! | North Korea Threat Resurfaces to Drag Stock Futures Lower | Sakshi
Sakshi News home page

కొరియా కల్లోలం!

Published Fri, Sep 22 2017 11:56 PM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

North Korea Threat Resurfaces to Drag Stock Futures Lower - Sakshi

ముంబై: అంతర్జాతీయ ప్రతికూలతలకు దేశీయ అంశాలు తోడుకావడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలపాలయ్యాయి. కొరియా తాజాగా యుద్ధ కాంక్షను ప్రకటించడం, చైనా రేటింగ్‌ డౌన్‌గ్రేడ్, దేశీయ ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు తోడుకావడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సూచీలు నిట్టనిలువునా కూలాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సుమారు 170 పాయింట్ల నష్టంతో ప్రారంభం కాగా, రోజంతా నష్టాల్లోనే కొనసాగి చివరికి క్రితం ముగింపుతో పోలిస్తే 447.60 పాయింట్లు (1.38 శాతం) కోల్పోయి 31,922.44 వద్ద ముగిసింది. ప్రారంభం నుంచి ముగింపు వరకు సూచీలు ఏ దశలోనూ కోలుకోకపోవడం అమ్మకాల ఒత్తిడిని సూచిస్తోంది.

గతేడాది నవంబర్‌ 15 తర్వాత ఒక్కరోజులో అతిపెద్ద పతనం ఇది. అంతకుముందు మూడు సెషన్లలో సెన్సెక్స్‌ 53 పాయింట్ల మేర నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలక మార్కు 10,000లోపునకు జారిపోయింది.157.50 పాయింట్ల నష్టంతో 9,964.40 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో నిఫ్టీ 9,952.80 కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ వారంలో సెన్సెక్స్‌ రికార్డు స్థాయిలో 350 పాయింట్లు (ఒక శాతం) కోల్పోగా, నిఫ్టీ 121 పాయింట్లు (1.19 శాతం) నష్టపోయింది. సెన్సెక్స్‌ ప్యాక్‌లో టాటాస్టీల్‌ షేరు ధర గరిష్టంగా 5 శాతం పతనమై రూ.654.55 వద్ద క్లోజయింది. ఎల్‌అండ్‌టీ 3.5 శాతం తగ్గగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, హీరో మోటోకార్ప్, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్‌ సైతం నష్టాలను ఎదుర్కొన్నాయి.

సూచీలోని విప్రో, కోల్‌ ఇండియా తప్ప మిగతావన్నీ నష్టాల్లోనే ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం రూ.1,299 కోట్ల మేర విక్రయాలు జరపగా, శుక్రవారం రూ.1,200 కోట్ల అమ్మకాలు జరిపారు. ఈ రెండు రోజుల్లో దేశీయ ఇనిస్టిట్యూషన్స్‌ నికరంగా రూ.1,900 కోట్ల మేర కొనుగోళ్లు జరిపాయి. బీఎస్‌ఈ రియల్టీ సూచీ 4.29 శాతం తగ్గింది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ సూచీలు 3 శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్‌ఈలో 2,139 స్టాక్స్‌ నష్టాల పాలు కాగా, 484 స్టాక్స్‌ లాభపడ్డాయి.


ఇన్వెస్టర్ల సంపదకు చిల్లు
మార్కెట్ల భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ.2.68 లక్షల కోట్ల మేర తరిగిపోయింది. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.2,68,853.7 కోట్ల మేర తగ్గి రూ.1,33,40,008 కోట్ల వద్ద స్థిరపడింది.

విశ్లేషకులు ఏమంటున్నారు..?
‘‘కొరియా ఉద్రిక్తతలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు చోటు చేసుకున్నాయి. ఫ్యూచర్స్, ఆప్షన్ల ముగింపు దగ్గర పడుతుండటంతో లిక్విడిటీపై ఒత్తిడి పడింది. ఎఫ్‌ఐఐలు నికర విక్రయదారులుగా ఉన్నారు. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం చర్యల్ని చేపడితే ద్రవ్యలోటు లక్ష్యాలపై ప్రభావం పడుతుందని ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ముఖ్య విశ్లేషకుడు ఆనంద్‌జేమ్స్‌ తెలిపారు.

‘‘కొరియా ఉద్రిక్తతల కారణంగా బలహీన ప్రపంచ సంకేతాల వల్లే మార్కెట్లు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. దీనికి తోడు ఎఫ్‌ఐఐలు అమ్మకాలు కొనసాగిస్తుండటం నష్టాలకు కారణం’’ అని యెస్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నిటాషా శంకర్‌ పేర్కొన్నారు. కొరియా ఉపఖండంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కరెక్షన్‌కు కారణమని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో అరుణ్‌ తుక్రాల్‌ కూడా తెలిపారు. ఈ తరహా పరిస్థితులకు ఈక్విటీ మార్కెట్లు వేగంగా స్పందిస్తాయని అభిప్రాయపడ్డారు.

అమ్మకాలు ఇందుకే...!
1 పసిఫిక్‌ మహాసముద్రంలో మరో శక్తివంతమైన హైడ్రోజన్‌ బాంబును పరీక్షించే అవకాశం ఉందంటూ  స్వయంగా ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి చేసిన ప్రకటన ఆసియా  మార్కెట్లపై ప్రభావం చూపింది. అది మన మార్కెట్లనూ తాకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మానసికంగా కలత చెందుతున్నారని, ఉత్తరకొరియాను దెబ్బతీయాలన్న కాంక్ష వల్ల తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఉత్తర కొరియా హెచ్చరించింది. దీంతో తగ్గుముఖం పట్టాయనుకున్న ఉద్రిక్త పరిస్థితి మొదటికొచ్చినట్టయింది.

2 ఉత్తరకొరియా వరుస అణు క్షిపణి ప్రయోగాలతో అమెరికా, ఆ దేశం మధ్య ఉద్రిక్తతలు మొదలైన దగ్గర్నుంచి అంటే గత నెల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు జరుపుతూనే ఉన్నారు. ఆగస్ట్‌ నెలలో నికరంగా రూ.15,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఆగస్ట్‌ నుంచి ఈ నెల 14 నాటికి చూస్తే... నికరంగా ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.22,693 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. మార్కెట్ల పతనానికి ఇది కూడా కారణమే.

3 ఈ ఏడాది ముగిసేలోపు మరోసారి పాలసీ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని, ఆర్థిక ఉద్దీపనలను అక్టోబర్‌ నుంచి క్రమంగా వెనక్కి తీసుకుంటామని(లిక్విడిటీ తగ్గింపు చర్యలు) అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చేసిన తాజా ప్రకటనతో డాలర్‌ తిరిగి బలపడుతోంది. రూపాయి 6 నెలల కనిష్ట స్థాయి(64.79)కి చేరింది.

4 మన స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ) ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్లో మూడేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.7 శాతానికి పడిపోవడంతో, దీన్ని పునరుద్ధరించేందుకు సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి  జైట్లీ తాజాగా చేసిన ప్రకటన సైతం ప్రభావం చూపింది. ప్రభుత్వం వృద్ధి రేటు కోసం వ్యయాలను పెంచితే ద్రవ్యలోటు క్రమం తప్పుతుందన్న ఆందోళనా తోడయింది. మరోపక్క, వృద్ధి అంచనాలను తాజాగా ఓఈసీడీ తగ్గించడం గమనార్హం.

5 మరోవైపు చైనా సార్వభౌమ రేటింగ్‌ను ఎస్‌అండ్‌పీ తగ్గించడం సైతం ప్రభావం చూపించింది. ఆసియా మార్కెట్ల నష్టాలకు ఇది కూడా కారణమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement