కొత్త ఏటీఎంలన్నీ ఇక మాట్లాడేవే!
ముంబై: బ్యాంకులు ఇకపై మాట్లాడే ఏటీఎంలనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు ఈ ఏడాది జూలై నుంచి కొత్తగా నెలకొల్పే ఏటీఎంలలో కస్టమర్లకు మాటల రూపంలో వివరాలను తెలియజేసే పరిజ్ఞానం, బ్రెయిలీ కీప్యాడ్‌లను తప్పనిసరి చేస్తూ ఆర్‌బీఐ బుధవారం ఆదేశాలు జారీచేసింది. 2009లో జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు తాము ఏర్పాటు చేసే ఏటీఎంలలో మూడింట ఒకటోవంతు మాట్లాడే, బ్రెయిలీ కీప్యాడ్‌లతో కూడినవి ఉండాలని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రధానంగా అంధులను దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలను విధించింది. అయితే, ఇప్పుడు జూలై 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చే అన్ని కొత్త ఏటీఎంలకూ ఈ రెండు సదుపాలనూ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
అంతేకాకుండా.. ప్రస్తుతం ఉన్న ఏటీఎంలు అన్నింటినీ కూడా మాట్లాడే, బ్రెయిలీ కీప్యాడ్‌లు ఉండేవిధంగా మార్చేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని కూడా బ్యాంకులకు ఆర్‌బీఐ తేల్చిచెప్పింది. వీల్‌చైర్‌ను ఉపయోగించేవారు/వైకల్యంగల వ్యక్తులు ఏటీఎంలను వినియోగించడంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రస్తుత, భవిష్యత్తులో ఏర్పాటు చేసే ఏటీఎంల వద్ద ర్యాంప్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఏటీఎంల ఎత్తు వీల్‌చైర్‌లో వచ్చే కస్టమర్లకు అనువుగా ఉండేవిధంగా చూడాలని పేర్కొంది. కంటిచూపు సరిగాలేని(లో విజన్) వ్యక్తుల కోసం ఏటీఎంల వద్ద మ్యాగ్నిఫయింగ్ గ్లాస్‌లను అందుబాటులో ఉంచాలని సూచించింది. వైకల్యంగల వ్యక్తులకు కల్పిస్తున్న సదుపాయాలన్నింటి వివరాలను తెలియజేసే నోటీసు బోర్డును కొట్టొచ్చినట్లు కనిపించేలా ఏర్పాటు చేయాలని కూడా నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ అంశాలకు సంబంధించిన పురోగతిని బ్యాంకులు తమ కస్టమర్ సర్వీస్ కమిటీకి ఎప్పటికప్పుడు నివేదించాలని స్పష్టం చేసింది.