జియో.. యూజర్లకు పెద్ద తలనొప్పి!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ జియో సర్వీస్ అంటూ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించారు. తక్కువ రోజుల్లోనే కోట్లమంది జియో సిమ్ యూజర్లను సంపాదించుకున్నారు. టెల్కోలు గగ్గోలు పెడుతున్నా తన పంథాను ఏ మాత్రం మార్చుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ఆగస్టులో జియో సర్వీస్ తీసుకొచ్చినా.. సెప్టెంబర్ 5నుంచి అధికారికంగా ఈ జియో సిమ్ సర్వీస్ లాంచ్ చేశారు. ఈ డిసెంబర్ 31వరకూ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, డాటా బ్రౌజింగ్, డౌన్ లోడ్ సర్వీసులు అంటూ మార్కెట్లోకి దూసుకొచ్చారు.
అయితే ఈ విషయం తెలిసిన కస్టమర్లు తొలుత జియో సిమ్స్ అంటూ రిలయన్స్ డిజిటల్స్, రిలయన్స్ మినీ స్టోర్స్ ముందు క్యూ కట్టేవారు ప్రస్తుతం ఇతర నెట్ వర్క్ యూజర్స్ నెట్ వర్క్ పోర్టబిలిటీ ద్వారా నంబర్ మార్చే అవసరం లేకుండా జియోకు మారిపోతున్నారు. అధికారికంగా 50లక్షల మంది జియో యూజర్లు నమోదైనట్లు సమాచారం. ఇక జియో అధినేత అంచనా ప్రకారం వీరి సంఖ్య 10కోట్లకు చేరితే ఆపై ఈ సమస్య తీవ్రత ఎలా ఉంటుందో కూడా అంచనా వేయడం కష్టం.
జియో వచ్చిన తొలి రోజుల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే జియో వెలకం ఆఫర్ తెలుసు కాబట్టి.. ఫ్రీ సిమ్ పొంది హాయిగా నెట్ వాడేశారు. కానీ, సెప్టెంబర్ 5తర్వాత జియో ప్రభంజనం మొదలైంది. యూజర్ల కష్టాలు రెట్టింపయ్యాయి. అందులో ముఖ్యమైన సమస్యలు ఇవే..
వాయిస్ కాల్స్ ఫెయిల్యూర్
ఎలాంటి రీచార్జ్ చేయకుండానే నెట్ సౌకర్యం ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయం ఉన్నా, ఇతర నెట్ వర్క్ వారు జియో యూజర్లకు ఇంటర్ కాల్స్ కనెక్షన్ సౌకర్యం కల్పించకపోవడంతో గతవారం వరకూ 15 కోట్ల వాయిస్ కాల్స్ చేయగా అందులో దాదాపు 12 కోట్ల కాల్స్ ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. జియో ఉన్నా, ఎమర్జెన్సీ కాల్స్ కోసం ఇతర నెటవర్క్ సిమ్ లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుందని యూజర్లు వాపోతున్నారు.
తగ్గిన ఇంటర్ నెట్ స్పీడ్
జియో వచ్చిన తొలిరోజుల్లో దాదాపు చాలా ప్రాంతాల్లో 40ఎంబీపీఎస్ స్పీడ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో 5ఎంబీపీఎస్ లోపే ఉండగా, కొన్ని నగరాలలో 6-10 వేగంతో నెట్ వస్తుందని చెబుతున్నారు. మూవీ చూస్తే కనీసం ఒక్కసారి కూడా బఫర్ కాని పరిస్థితి నుంచి చిన్న వీడియో చూసినా చాలా సమయం తీసుకుంటుంది.
జియో యాప్స్ తో సమస్యలు
జియో యాప్స్ లో ఏ ఒక్కటి స్మార్ట్ ఫోన్లో లేకున్నా.. ఇతర యాప్స్ పై ఆ ప్రభావం కనిపిస్తుంది. జియో 4జీ వాయిస్ చాలా సందర్భాలలో ఆఫ్ లైన్ అని వస్తుంది. ఆ సమయంలో మనం డాటా వాడుకోవచ్చు కానీ, వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవడానికి వీలుండదు. జియో టీవీ యాప్ క్రాష్ అయితే, తిరిగి టీవీ ఆన్ చేయడానికి చాలా సమయం వృథా చేసుకోకతప్పదు.
వీఓఎల్టీఈ సపోర్ట్ లేదు
4జీ సౌకర్యం ఉన్న చాలా రకాల స్మార్ట్ ఫోన్లలో ఎల్టీఈ మాత్రమే ఉంది. VOLTE సపోర్ట్ చేయని యూజర్లకు ఈ కష్టాలు కాస్త ఎక్కువ. జియో 4జీ వాయిస్ వారికి నెట్ అందుబాటులో ఉన్నా సౌకర్యాన్ని వాడుకోలేరు. ఇప్పటివరకూ మార్కెట్లో ఉన్న ఫోన్లలో 3జీ మొబైల్స్ వాడుతున్న వారే ఎక్కువగా ఉన్నారు.
బ్యాటరీని తోడేస్తుంది
రిలయన్స్ జియో తమ సర్వీస్ లను 4జీ పై అందిస్తున్నాయి. 2జీ, 3జీ సపోర్టెట్ మొబైల్స్ కంటే 4జీ మొబైల్స్ వేగంగా పనిచేయడంతో తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ తీసుకుంటుంది. కొన్ని కంపెనీలు 4జీ సర్వీసులు అందిస్తున్నా, బ్యాటరీ విషయంలో కనీసం 3వేల ఎంఏహెచ్ సామర్థ్యాన్ని కూడా అందించడం లేదు. నెట్ వినియోగించి తరచూ వీడియోలు వీక్షించే యూజర్లు ఎక్కువగా తమ ఫోన్ ను చార్జింగ్ కు కనెక్ట్ చేసి ఉంటున్న విషయం తెలిసిందే.