మ్యూజిక్ సర్వీసులో ట్విట్టర్ పెట్టుబడి
మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ ఓ కొత్త పద్ధతిలో మ్యూజిక్ సర్వీసుల్లోకి ప్రవేశించింది. పాపులర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు సౌండ్ క్లౌడ్ లో 700లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ట్విట్టర్ సౌండ్ క్లౌడ్ లో పెట్టుబడులుగా పెట్టినట్టు టెక్నాలజీ వెబ్ సైట్ రీ/కోడ్ రిపోర్టు నివేదించింది. నెలకు 300 మిలియన్ యాక్టివ్ యూజర్లు కలిగిఉన్న ట్విట్టర్, తిరోగమనంలో ఉన్న తన వృద్ధిని పెంచుకోవడానికి ఈ పెట్టుబడులు పెట్టినట్టు రిపోర్టు పేర్కొంది. ఈ పెట్టుబడుల విషయాన్ని ట్విట్టర్ సైతం అంగీకరించింది. కానీ ఎలాంటి ఫైనాన్సియల్ వివరాలు బయటికి వెల్లడించలేదు.
దాదాపు రెండేళ్ల క్రితం ఈ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్, సౌండ్ క్లౌడ్ ను కొనుగోలు చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. కానీ తర్వాత ఈ కొనుగోలుపై మౌనం పాటించడం మొదలుపెట్టింది. ట్విట్టర్ తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టిందని సౌండ్ క్లౌడ్ అధికారిక ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. సమకాలనీ సంస్కృతి నుంచి స్ఫూర్తిపొందిన ఈ రెండు కంపెనీలు, గ్లోబల్ గా లక్షలాది మందిని చేరుకోవడానికి కృషిచేస్తున్నామని చెప్పారు. సౌండ్ క్లౌడ్ ప్లాట్ ఫామ్ ఇటు సృష్టికర్తలకి, అటు శ్రోతలకి వారధిలా ఉంటుంది.
మ్యూజిక్ ను అప్ లోడ్ చేయడానికి, షేర్ చేయడానికి, ఇతర ఆడియో ఫైల్స్ కు ఇది ఓ ప్లాట్ ఫామ్. మ్యూజిక్ సిస్టమ్ లోకి ప్రవేశించడానికి ట్విట్టర్ 2013లోనే ప్రయత్నాలు చేసింది. ట్విట్టర్ మ్యూజిక్ సర్వీసును ఆవిష్కరించింది. అయితే ఏడాది తర్వాత ఈ సేవలు మూతపడ్డాయి. కొత్త పద్ధతిలో మ్యూజిక్ సర్వీసులను తీసుకొస్తామని ఆ సమయంలోనే ట్విట్టర్ ప్రకటించింది.