వావ్.. వర్చువల్
సాక్షి, హైదరాబాద్: ప్రీమియం ప్రాంతాల్లో ఆఫీసు ప్రారంభించాలంటే స్థానికంగా స్థిరాస్తి ధరలను భరించడం అన్ని సంస్థలకు కుదరదు. పెద్ద కంపెనీలకు మినహాయిస్తే.. సూక్ష్మ,, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), స్టార్టప్ కంపెనీలతోటి అయ్యేపని కానేకాదు! మరెలా? ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తున్నాయి వర్చువల్ ఆఫీసులు. స్థలం, ఫర్నిచర్, వైఫై, ల్యాప్‌టాప్, సమావేశ గదులు వంటివెన్నో అద్దెకివ్వడమే ఈ కార్యాలయాల ప్రత్యేకత.
ఈ రకమైన సేవలు వర్చువల్, సర్వీస్ ఆఫీసులని రెండు రకాలుగా ఉంటాయి. ఇంపీరియల్ సర్వ్‌కార్ప్, ఐకేవా, యూనీస్పేస్ కంపెనీలెన్నో ఈ రకమైన సేవలందిస్తున్నాయి.
వర్చువల్ ఆఫీసు: ఆఫీసుకు చిరునామా, ఫోన్ నెంబర్, ఫ్యాక్స్ సేవలుంటాయి. క్లయింట్లు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకునేందుకు ఓ రిసెప్షనిస్ట్ ఉంటుంది. ఆఫీసుకొచ్చే ఫోన్లు స్వీకరించి సంబంధింత యాజమాన్యానికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ప్రారంభ ధరలు రూ,2 వేల నుంచి మొదలవుతాయి. ఇంట్లోనే ఉండి ఆఫీసును ప్రారంభించాలనుకునే వారికి ఇవి ఉపయుక్తం.
సర్వీస్ ఆఫీసు: వీటిలో ఆఫీసును పెట్టుకునేందుకు వీలుగా అద్దెకు స్థలం కేటాయిస్తారు. చ.అ.లను బట్టి ధరలుంటాయి. సుమారుగా రూ.30 వేల నుంచి లక్షకు పైగానే ధరలుంటాయి. సమావేశ గదులు, వీడియో కాన్ఫరెన్స్, ఇంటర్నెట్ వంటివెన్నో వసతులుంటాయి.
లాభమేంటో..
⇔ కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టే వారు ఆ బిజినెస్‌ను ప్రజలు ఎలా స్వాగతిస్తారు? ఎలాంటి మార్పులవసరం వంటి అనేక అంశాలను తెలుసుకునేందుకు వర్చువల్ ఆఫీసులు ఉపయోగపడతాయి.
⇔ కంపెనీకి ప్రొఫెషనల్ బిజినెస్ అడ్రస్ వస్తుంది. అంతేకాకుండా అందరూ సులువుగా గుర్తు పట్టే ప్రాంతంలో ఆఫీసు అడ్రస్ ఉండటంతో కంపెనీపై నమ్మకం ఏర్పడుతుంది.
⇔ సొంతంగా ఆఫీసును పెట్టుకుంటే ఉద్యోగులు, భద్రతా సిబ్బంది వేతనాలు, విద్యుత్ చార్జీలు వంటివెన్నో స్వయంగా భరించాల్సి ఉంటుంది. అదే వర్చువల్ ఆఫీసుల్లో అయితే అవేమీ ఉండవు. ఆఫీసు స్థలానికి, రిసెప్షనిస్ట్‌కు డబ్బులు చెల్లిస్తే చాలు.
⇔ సొంతంగా ఆఫీసుంటే యజమాని ప్రతి రోజూ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ఇందుకోసం కారు, బండి వాటిని వినియోగించాలి. దీంతో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వనరుల ఖర్చులూ భరించాల్సి ఉంటుంది. అదే వర్చువల్ ఆఫీసైతే యజమాని రోజూ ఆఫీసుకు రావాల్సిన అవసరం ఉండదు. దీంతో ఇంధనం వినియోగం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు చేసినవారమవుతాం.