![Bihari Migrant Died In Mob Attack In Surat - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/13/amarjit-singh.jpg.webp?itok=ww7jD-Do)
సూరత్ : ఓవైపు గుజరాత్ నుంచి హిందీ మాట్లాడేవారు తమ సొంత రాష్ట్రాలకు తిరిగివెళ్తుంగా.. మరోవైపు వారిపై దాడులూ జరుగుతున్నాయి. 14 నెలల పసికందుపై అకృత్యానికి పాల్పడిన ఓ బిహారీ యువకుడి కారణంగా గుజరాత్‌లో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. తాజాగా బిహార్‌కు చెందిన ఓ యువకుడిపై శనివారం మూకదాడి జరిగింది. తీవ్రగాయాలతో ఆయన ఘటనాస్థలంలోనే మృతిచెందాడు.
మృతుని తండ్రి తెలిపిన వివరాలు.. పదిహేనేళ్లుగా సూరత్‌లో నివాసముంటున్న అమర్‌జీత్ సింగ్ (32) శనివారం సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తుండగా.. దుండగులు ఆయనపై దాడి చేసి చంపేశారు. అమర్‌జీత్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులకు సమాచారమిచ్చినా స్పందించడం లేదని మృతుని తండ్రి రాజ్‌దేవ్‌సింగ్ కన్నీరుమున్నీరయ్యాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన వేడుకున్నారు.
కాగా, ఘటనపై స్పందించిన పోలీసులు అమర్‌జీత్‌ది రోడ్డు ప్రమాదం అని తెలిపారు. సహోద్యోగిని ఇంటివద్ద వదిలి వస్తుండగా ప్రమాదం జరిగి అమర్‌జీత్ మరణించాడని పేర్కొన్నారు. మరోవైపు గుజరాత్ వ్యాప్తంగా 50 వేల మంది హిందీ మాట్లాడేవారు తమ సొంతరాష్ట్రాలకు వెళ్లిపోగా, అధికారులు మాత్రం ఆ సంఖ్య 15 వేలే అని చెప్పడం గమనార్హం. ఇప్పటివరకు గుజరాతీయేతర ప్రజలపై 70 హత్యా ఘటనలు జరిగినట్టు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని పోలీసులు తెలిపారు. అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న దాదాపు 600 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment