కాలి బూడిదైన ఇళ్లు, విలపిస్తున్న బాధితురాలు
అందరూ కూలీలే.. ఏ రోజుకారోజు కష్టాన్ని చిందించి కాలే కడుపులు చల్లార్చుకునే వారే..ఆదివారం ఉదయం కూడా పొద్దు పొడిచీ పొడవ ముందే టిఫిన్లతో చద్దన్నం కట్టుకుని పొలాల గట్ల వెంట బతుకు వేటకు వెళ్లారు. ఇంటి దగ్గర ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఇదే సమయంలో అగ్గి రవ్వ ఇళ్లను చుట్టేసింది. క్షణాల్లో ఎనిమిది పూరిళ్లను భస్మీపటలం చేసింది.. ఏడు పశువుల కొష్టాలను బుగ్గిగా మార్చింది. నాలుగు లేగ దూడలు, పది గొర్రెలను పొట్టన పెట్టుకుంది. విషయం తెలిసి పరుగు పరుగున వచ్చిన కూలీలు బుగ్గయిన ఇళ్లను చూసి గుండెలు బాదుకున్నారు. ఎటు చూసినా కాలి మోడుగా మిగిలిన గోడలు, పశువుల మూగ రోదనలు, అగ్గి మిగిల్చిన బూడిదతో వినుకొండ మండలంలోని ఉప్పరపాలెం గుండె కన్నీటి చెరువైంది.
గుంటూరు, వినుకొండ: మండలంలోని ఉప్పరపాలెంలో అదివారం జరిగిన అగ్ని ప్రమాదం 15 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 8 పూరిళ్లు, 7 కొష్టాలు అగ్నికి అహుతయ్యాయి. నాలుగు లేగ దూడలు, పది గొర్రె పిల్లలు, రెండు టైర్లు బళ్లు కాలిపోయాయి. రూ. 20 లక్షలకుపైగా ఆస్తి నష్టం సంభవించింది. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయం కావటంతో అందరూ కూలి పనులకు వెళ్లారు. ఇళ్ల వద్ద కనీసం ఒక్కరంటే ఒక్కరూ కూడా లేరు. ఈ సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి 15 పూరి పాకలు క్షణాల్లో దగ్ధమయ్యాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సకాలంలో వాహనం అక్కడకు చేరుకోలేకపోవటంతో కళ్ల ముందే ఇళ్లు భస్మీపటలమయ్యాయి. అగ్నిమాపక వాహనం వచ్చాక మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఆర్పేశారు.
సర్వం కోల్పోయిన బాధితులు
అగ్ని ప్రమాదంలో తోక తిరుపతమ్మ కొష్టంలోని ఒక దూడ అగ్నికీలలకు మృత్యువాత పడింది. గుమ్మా రాజయ్య పూరిళ్లు ఆహుతైంది. వ్యవసాయ పనుల నిమిత్తం తెచ్చిన రూ. లక్ష రూపాయలు కాలిపోయాయి. కాళంగి శ్రీనుకు చెందిన 15 బస్తాల ధాన్యం, ఒక దూడ, కాళంగి ఏడుకొండలు, కాళంగి చిన హనుమయ్య కొష్టం, నాలుగు దూడలు, బ్యాంకులో బంగారం కుదవ పెట్టి తెచ్చిన రూ. 2 లక్షల నగదు కాలి బూడిదయ్యాయి. బొరిగొర్ల కోటేశ్వరరావుకు చెందిన ఇంటిలో వ్యవసాయం కోసం తెచ్చిన రూ. 2 లక్షల నగదు, కాళంగి కొండ గురవయ్య కొష్టం, బైలడుగు మున్నెయ్య కొష్టం, బొరిగొర్ల పెద బక్కయ్య, బొరిగొర్ల చిన్న బక్కయ్య పూరిళ్లు, బండి చిన అంజయ్య, బండి రామాంజి, బండి వెంకయ్య, బండి చిన్న వెంకటేశ్వర్లు, బండి గురవయ్యల పూరిపాకలను అగ్నికీలలు మింగేశారు. ఈ ప్రమాదంలో రూ.20 లక్షలకుపై ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా రెవెన్యూ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
పూరిళ్లపైగా వేలాడుతున్న విద్యుత్ తీగలు గాలికి రాజుకుని నిప్పు రవ్వలు పడటంతో అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని గ్రామస్తులు, అధికారులు అంచనా వేస్తున్నారు. తక్షణ సాయం కింద అధికారులు ఒక్కో బాధితుని కుటుంబానికి 20 కేజీల బియ్యం, రూ. 5 వేల నగదును అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment