శుభకార్యానికి వేసిన టెంటులో మృతదేహాల వద్ద రోధిస్తున్న బంధువులు..
హైదరాబాద్: నూతన గృహప్రవేశ ఆనందంలో కుటుంబసభ్యులు, బంధువులు ఉన్నారు. అంతలోనే ఆ ఇంట విషాదం అలుముకుంది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన ముగ్గురిని క్వారీగుంత కబళించింది. మృత్యువాత పడినవారిలో తల్లి, కుమారుడు ఉన్నారు. కొడుకును, భార్యను కోల్పోయిన వ్యక్తి రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. వివరాలు.. కర్ణాటక గురిమెట్టుకాల్ క్యాశవరం గ్రామానికి చెందిన కె.నర్సింహ, సావిత్రమ్మ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. యూసుఫ్‌గూడ కార్మికనగర్‌లో ఉంటూ చీపుర్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. నర్సింహ ఇటీవల గాజులరామారం సర్కిల్ బాలయ్యనగర్‌లో ఇల్లు కట్టుకున్నాడు.
గృహప్రవేశ కార్యానికి మహబూబ్‌నగర్, కర్ణాటకల నుండి బంధువులు వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పూజలు ముగిశాయి. ఉదయం 10.30 గంటలకు నర్సింహ తల్లి అయ్యమ్మ(65), సావిత్రమ్మ అక్క అనిత (30), ఆమె కుమారుడు యశ్వంత్(10) బట్టలు ఉతికేందుకు సమీపంలోని క్వారీ గుంత వద్దకు వెళ్లారు. యశ్వంత్ నీటిలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కుంటలో జారిపడ్డాడు. బాలుడిని కాపాడబోయిన సావిత్రమ్మ, అయ్యమ్మలు కూడా నీటిలో మునిగిపోయారు. వీరి అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చేరవేశారు. దీంతో బంధువులు క్వారీ గుంతలో దిగి మృతదేహాలను బయటకు తీశారు. అప్పటికే వారు విగతజీవులయ్యారు. కుమారుడు యశ్వంత్, భార్య అనితను కోల్పోయిన ఎల్లప్ప అనే వ్యక్తి కన్నీరుమున్నీరుగా విలపించాడు. జగద్గిరిగుట్ట పోలీసు లు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment