అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో ఉన్న నందీశ్వరుని పురాతన విగ్రహం (ఫైల్)
రామచంద్రపురం: పట్టణంలోని అగస్త్యేశ్వరస్వామివారి ఆలయంలోని గల పురాతన నంది చోరీ సంఘటన ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గత నెల 23 అర్ధరాత్రి సమయం దాటాక అగస్త్యేశ్వర స్వామివారి ఆలయంలోని పురాతన నందిని కొంతమంది దుండగులు అపహరించిన విషయం తెలిసిందే. చోరీ జరిగిన తొమ్మిది రోజులకు పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని, అపహరణ చేసిన వారు దొరికారంటూ పట్టణంలో శుక్రవారం ఎక్కడ చూసినా చర్చగానే మారింది. పట్టణంలోని సీసీ కెమెరాల్లో దొరికిన ఆధారాలతో రామచంద్రపురం సీఐ పి.శివగణేష్, ఎస్సై లక్ష్మి నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
దేవదాయ శాఖకు చెందిన ఉద్యోగులతో పాటుగా హౌసింగ్ బోర్డుకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకుని కాకినాడలోని ఒక పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అపహరించిన వారు దొరికారని అనుకుంటుండగా అపహరణకు గురైన నంది ఆచూకీని పోలీసులు కనుగొనలేకపోయారనే విషయంతో భక్తులు అందోళనకు గురవుతున్నారు. సుమారుగా 12 మంది వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నంది విగ్రహం అపహరణకు గురికావడం, గతంలో ఒక అర్చకుడు ఆత్మహత్య చేసుకుని పట్టణంలో మృతి చెందిన సంఘటనలతో అపచారం జరుగుతోందని బెంబేలెత్తిపోతున్నారు. నంది చోరీ సంఘటనలో కొంత మంది దొరికానే సమాచారంతో నంది కూడా దొరుకుతుందనే ఆశతో భక్తులున్నారు. కానీ నంది లేదనే సమాచారంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై రామచంద్రపురం సీఐ పి శివగణేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా కొంత మంది అనుమానితులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నామని, నంది చోరీని త్వరలోనే ఛేదిస్తామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ స్వామీజీ హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
విగ్రహం అపహరణలో గుమ్మళ్లదొడ్డికి లింకులు?
గోకవరం (జగ్గంపేట): నంది విగ్రహం అపహరణ విషయంలో గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డికి చెందిన వ్యక్తి పాత్ర ఉందని తెలిసింది. ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్న పోలీసులు శుక్రవారం గ్రామానికి వచ్చి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈనెల 24న అపహరణకు గురైన టన్ను బరువు గల నంది విగ్రహాన్ని మినీ వ్యాన్‌లో గ్రామానికి తీసుకువచ్చి ప్రధాన రహదారి పక్కన ఐఓసీఎల్ టెర్మినల్ సమీపంలో పోలీసు రికార్డుల్లో ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో ఉంచి వెల్డింగ్ మెషీన్ సహాయంతో పగలుగొట్టినట్టు తెలిసింది. పగలు, రాత్రి ఇంట్లోంచి శబ్ధాలు వస్తుండడంతో ప్రశ్నించిన వారికి ఇంట్లో గ్రానైట్ పనులు చేస్తున్నామని ఆ వ్యక్తి సమాధానం చెప్పినట్టు పలువురు చెబుతున్నారు. అయితే పోలీసులు వచ్చి విచారణ చేయడంతో విషయం గుప్పుమంది. ఈ సంఘటనతో గ్రామానికి, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ఇంకెవరైనా వ్యక్తులతో సంబంధం ఉందేమోనని పలువురు చర్చించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment