ప్రతీకాత్మక చిత్రం
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఆగష్టు 9 న జరిగిన ఓ హత్య కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పాత కక్షల నేపథ్యంలో ఓ కుటుంబంపై పగ పెంచుకున్న బంధువు ఆ కుటుంబంలోని ఐదుగురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని బర్వానీ ప్రాంతంలో రాయ సింగ్ కుటుంబం నివాసముంటున్నారు. పెద్ద కుమారుడు వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తుండటంతో ఈ నెల 11న ఇంటికి వచ్చిన అతడికి కుటుంబ సభ్యలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. అదే సమయంలో ఈ కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు గోయి నదిలో లభించాయి.
అంతేకాకుండా అదే రోజు సాయంత్రం రాయసింగ్ భార్య మృతదేహం మరో ప్రాంతంలో లభించడంతో కుటుంబ సభ్యలు హత్యకు గురైనట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు గ్రామ ప్రజలను, బంధువులను ప్రశ్నించారు. దీంతో అసలు నిజం బయటపడింది. రాయా సింగ్ మేనల్లుడు చిచియా సింగ్ (22)పాత కక్షలతో ఆ కుటుంబాన్ని హతమార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సోదరుడి సహాయంతో రాయాసింగ్(45), అతని భార్య, ఇద్దరు కుమారులుతో పాటు రెండేళ్ల కూతురిని హతమార్చి వేర్వేరు ప్రాంతాల్లో పారేసినట్లు నిందితుడు అంగీకరించాడు. గతంలో రాయాసింగ్ తన అన్నను చంపాడని, అందుకే ప్రతికారంతో తన కుటుంబాన్ని అంతం చేసినట్లు వెల్లడించాడు. నిందితుడితోపాటు అతడి సోదరుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. తాజాగా పోలీసులు రాయాసింగ్, అతని కూతురు మృతదేహాన్ని కూడా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment