కాశమ్మ, లొంగిపోయిన నిందితుడు అఖిల్
హుజూర్‌నగర్ రూరల్ : అల్లుడి చేతితో ఓ అత్త దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన హుజూర్‌నగర్ మండల పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామపంచాయతీ పరిధి మిట్టగూడెం గ్రామానికి చెందిన నాశబోయిన వెంకన్న, కాశమ్మ (46) దంపతులకు ముగ్గురు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వెంకన్న అనారోగ్య కారణాలతో మృతిచెందాడు. అప్పటినుంచి కుటుం బ భారం కాశమ్మపైనే పడింది. కాయకష్టం చేసి తొలుత ఇద్దరు కుమార్తెలకు వివాహాలు జరిపించింది.
నాలుగేళ్ల క్రితం చిన్నకూమార్తెకు..
కుటుంబ పెద్ద మరణించినా కాశమ్మ కూలిపనులు చేస్తూ కడుపుకట్టుకుని చిన్న కుమార్తె లలితకు నాలుగేళ్ల క్రితం చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడేనికి చెందిన బొడ్డు అఖిల్‌కు ఇచ్చి వివాహం జరిపించింది. వీరికి ఓ మూడేళ్ల పాప కూడా ఉంది. అఖిల్ మేళ్లచెర్వు మండల కేంద్రంలోని ఓ బైక్ సర్వీసింగ్ పాయింట్‌లో వర్కర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
కాపురానికి పంపించడం లేదని..
ఒకటి రెండు రోజుల తర్వాత అఖిల్ భార్యను కాపురానికి పంపించాలని అత్త కాశమ్మకు ఫోన్‌లో బతిలాడాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తరచూ ఇదే తంతుగా మారిందని తన కూతురిని పంపించలేని తెగేసి చెప్పేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా అఖిల్ శనివారం రాత్రి పది గంటల సమయంలో అత్తగారి ఊరైన మిట్టగూడేనికి చేరుకున్నాడు. అప్పుడే నిద్రపోయిన అత్తతో తన భార్యను కాపురానికి పంపించాలని వాగ్వాదానికి దిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఘర్షణపడ్డాడు. అనంతరం పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో అత్త కాశమ్మపై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. కత్తిదాడిలో కూప్పకూలిన తల్లిని చూసి లలిత హతాశురాలైంది. లబోదిబోమని మొత్తుకోవడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి కాశమ్మను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. కాగా, అత్తను దారుణంగా పొడిచి హత్య చేసిన అఖిల్ ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు లొంగిపోయాడు. మృతురాలి రెండో కుమార్తె కన్నెబోయిన సుజాత భర్త సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు హుజూర్‌నగర్ సీఐ రాఘవరావు తెలిపారు.
మద్యానికి బానిసై..
సాఫీగా సాగిపోతున్న వారి కాపురంలో మద్యం మహమ్మారి చిచ్చురేపింది. అఖిల్ సర్వీసింగ్ పాయింట్‌లో వర్కర్‌గా పనిచేయగా వచ్చి డబ్బులతో నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అఖిల్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్య లలితతో నిత్యం ఘర్షణ పడుతుండేవాడు. భర్త దెబ్బలకు తాళలేక లలిత పుట్టింటికి వెళ్లిపోయేది. రెండుమూడు రోజుల తర్వాత అఖిల్ అత్తగారింటికి వెళ్లి నచ్చజెప్పుకుని ఇంటికి తీసుకొచ్చుకునేవాడు.
మళ్లీ గొడవలు జరుగుతుండడంతో..
కొద్ది రోజులుగా మద్యానికి దూరంగా ఉన్న అఖిల్ మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో గత నెల 25వ తేదీన పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన అఖిల్ భార్యతో మళ్లీ గొడవపడి చావబాదాడు. దీంతో భయాందోళన చెందిన లలిత అదే రోజు రాత్రి తల్లిగారి ఊరైన మిట్టగూడేనికి కూతురిని తీసుకుని వచ్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment