దగ్గుబాటి అభిరామ్‌కు బెదిరింపులు | Threats to the Daggubati Abhiram | Sakshi
Sakshi News home page

దగ్గుబాటి అభిరామ్‌కు బెదిరింపులు

Published Thu, May 10 2018 1:09 AM | Last Updated on Sat, Aug 11 2018 8:57 PM

Threats to the Daggubati Abhiram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు కుమారుడు అభిరామ్‌కు బెదిరింపులు ఎదురయ్యాయి. అతడి సెల్‌ఫోన్‌ను తస్కరించిన నలుగురు దుండగులు అందులో ఉన్న ‘ఆ ఫొటోలు’బయట పెడతామంటూ బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగారు. అవి బయటపెట్టకుండా ఉండా లంటే రూ.1.5 కోట్లు చెల్లించాలంటూ ఈ–మెయిల్‌ పెట్టారు. సురేశ్‌బాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గత వారం నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు. 

ఫోన్‌ తస్కరించి.. మెయిల్‌ చేసి.. 
అభిరామ్‌తో ఓ మహిళ సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఇటీవల బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనించిన నలుగురు యువకులు అభిరామ్‌ ఫోన్‌ను తస్కరించాలని పథకం వేశారు. అందులో ఉన్న అంశాలను క్యాష్‌ చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే గత నెలలో అభిరామ్‌ ఓ రెస్టారెంట్‌లో ఉన్న సమయంలో అతడి ఐఫోన్‌ను తస్కరించారు. దాని పాస్‌వర్డ్‌ను క్రాక్‌ చేసిన దుండగులు అందులో ఉన్న ఫొటోలు, వీడియోల్లో ‘కొన్నింటిని’చూశారు. వీటిని అడ్డం పెట్టుకుని అభిరామ్, సురేశ్‌బాబు నుంచి డబ్బు గుంజడానికి నిర్ణయించుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఈ–మెయిల్‌ ఐడీని క్రియేట్‌ చేసి, దాని నుంచి గత నెల 24న అభిరామ్‌కు మెయిల్‌ పంపారు. అందులో ‘ఆ ఫొటోలు, వీడియోల’విషయం ప్రస్తావిస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించారు. అవి బయటపెట్టకుండా ఉండాలంటే తమకు రూ.1.5 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

నలుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు 
ఈ–మెయిల్‌ చూసి కంగుతిన్న సురేశ్‌బాబు గత నెల్లో నగర పోలీసు కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. బాధ్యులుగా గుర్తించిన కె.రఘురామవర్మ(పశ్చిమగోదావరి జిల్లా నేలమర్రుకు చెందిన నిరుద్యోగి), ఎన్‌.కార్తీక్‌(పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన నిరుద్యోగి), తిరుమలశెట్టి నాగవెంకటసాయి(కూకట్‌పల్లిలో కూరగాయలు అమ్మే నేలమర్రు వాసి), పి.చంద్రకిషోర్‌(చింతల్‌లో ఉండే పశ్చిమగోదావరి జిల్లా పెందుర్రుకు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి)లను అరెస్టు చేశారు. సాయి, కిషోర్‌ అభిరామ్‌ ఫోన్‌ తస్కరించి మిగిలిన వారికి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఏ ఫొటోలు, వీడియోల పేర్లు చెప్పి బ్లాక్‌మెయిల్‌ చేశారనేది గోప్యంగా ఉంచారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement