22న యువభేరి
22న యువభేరి
Published Fri, Sep 16 2016 11:44 PM | Last Updated on Thu, Oct 4 2018 4:39 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు :రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరులో సమరశంఖం పూరించనున్నారు. ఈ నెల 22న నగరంలోని శ్రీ కన్వెన్షన్ హాల్‌లో విద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులు, నిరుద్యోగులతో యువభేరి నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదాను తుంగలో తొక్కి ప్యాకేజీ పేరుతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరో ఉద్యమానికి వైఎస్ జగన్‌మోహనరెడ్డి సన్నద్ధం కావడంతో.. ఈ కార్యక్రమం జరిగే కన్వెన్షన్ హాల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం పరిశీలించారు.
అనంతరం వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 22న ఉదయం 10 గంటలకు యువభేరి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని, వారి మనోభావాలను దెబ్బతీస్తూ ప్యాకేజీకి గంగిరెద్దులా తలూపారని విమర్శించారు. తానేదో œునకార్యం చేసినట్టు ప్రధాని నరేంద్రమోదీకి చంద్రబాబు ఫోన్ చేసి ప్యాకేజీ ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలపడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెబుతూ ప్రజల కోసం వైఎస్ జగన్ ఇప్పటికే అనేక పోరాటాలు చేశారని, ఇప్పటికీ అదేమాటకు కట్టుబడి పోరాటాలను కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. గతంలో ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష, ఢిల్లీ వెళ్లి అక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం రాష్ట్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందని చెప్పారు. వైఎస్ జగన్ ఒక్కరే రాష్ట్రానికి హోదా తీసుకురాగల సమర్థుడని ప్రజలు గుర్తించారన్నారు. హోదా కోసం సాగిస్తున్న పోరాటాలను నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని, ఇందులో భాగంగానే శాసనసభలో ప్రత్యేక హోదాపై చర్చ రాకుండా ప్రతిపక్షాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల హోదా కోసం తమ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర బంద్‌ను సైతం విఫలం చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రత్యేక హోదానే ఊపిరిగా జీవిస్తున్న రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ పిలుపును అందుకుని స్వచ్ఛందంగా బంద్ పాటించారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించి హోదా ఎగవేతకు కేంద్రం చంద్రబాబుకు ఎరవేసిందని విమర్శిం చారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్ కోసం విడుదల చేసిన నిధులకు లెక్కలు చెప్పలేదని ఆరోపించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
తప్పించుకునేందుకే..
పార్టీ జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు హోదా ఇవ్వకుండా తప్పించుకునేందుకే విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదని, 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదని కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు. కేంద్ర కేబినెట్ కన్నా 14వ ఆర్థిక సంఘం బలీయమైన శక్తి కాదని, కేబినెట్ తీర్మానిస్తే ఏ సంస్థ అయినా ఆమోదించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్రం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని సూచించారు. రాజధాని, నిమ్స్, ఎయిమ్స్ వంటి ఆసుపత్రులు లేని, అత్యంత రెవెన్యూ లోటు గల రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటేనన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత లేదని, రాష్ట్రానికి చట్టబద్ధత గల హోదానే కావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ఘంటా మురళి, కొట్టు సత్యనారాయణ, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, తానేటి వనిత, నియోజకవర్గ కన్వీనర్లు తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, కొఠారు రామచంద్రరావు, కవురు శ్రీనివాస్, దయాల నవీన్‌బాబు, గుణ్ణం నాగబాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొద్దాని శ్రీనివాస్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్ లంకపల్లి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement