నోట్ల రద్దుకు మద్దతుగా బీసీ సంఘం ప్రదర్శన
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. నల్లధనం, దొంగ నోట్లు, అవినీతిని అరికట్టాలని, దేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దాలని యువత నినాదాలు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దుపై ప్రధాని మోదీ తీసుకున్న చర్య విప్లవాత్మకమన్నారు. దీన్ని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నల్లధనాన్ని అరికట్టే చర్యకు మద్దతు ఇవ్వకుండా రాజకీయ కారణాలతో వ్యతిరేకించడం తగదని హితవు పలికారు. కొందరు బ్యాంకు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు. కొత్త నోట్ల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నది వాస్తవమేనని, వ్యవస్థను ప్రక్షాళన చేసే సమయంలో తాత్కాలిక ఇబ్బందులు తప్పవని చెప్పారు. నోట్ల మార్పిడి వల్ల ప్రభుత్వానికి ఆదాయ పన్ను రూపంగా వచ్చే మొత్తాన్ని ప్రజల జన్‌ధన్ ఖాతాల్లో జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, కుల్కచర్ల శ్రీనివాసు, నర్సింహగౌడ్, రాజేందర్, కృష్ణయాదవ్, అనంతయ్య, జైపాల్, వినయ్, గజేందర్ తదితరులు పాల్గొన్నారు.