బస్సు బీభత్సం
Published Sat, Jul 30 2016 12:42 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
డాబాగార్డెన్స్: నగరంలోని జడ్జికోర్టు రోడ్డులో ఆర్టీసీ సిటీ బస్సు అదుపు తప్పి బీభత్సం సష్టించింది. ఈ సంఘటనలో ఒక నిండు గర్భిణి అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. ఒక ఆటో నుజ్జునుజ్జు కాగా, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక తోపుడు బండి ధ్వంసమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు నుంచి వస్తున్న 20ఎ నెంబర్ సిటీ బస్సు జడ్జికోర్టు సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద పూర్తిగా అదుపు తప్పింది. రోడ్డుకు ఎడమవైపు నుంచి వెళ్తున్న ఒక్కసారిగా కుడివైపునకు తిరిగి అక్కడి బస్టాపులో ఉన్న ప్రయాణికులపైకి దూసుకుపోయింది. మధురవాడ స్వతంత్రనగర్‌కు చెందిన తొమ్మిది నెలల నిండు గర్భిణి నూకరత్నం కడుపుపైకి ఎక్కేయడంతో ఆమె అక్కడికక్కడే కన్ను మూసింది. అదే ఊపులో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటో, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక తోపుడు బండిపైకి దూసుకుపోవడంతో అవి ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో మతి చెందిన నూకరత్నం ఆడపడుచు బి.లక్ష్మి, అక్కడే తోపుడు బండి వ్యాపారి కె.మహేష్, పనుల కోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ వచ్చిన పి.మాధవరావు, సీతంపేటకు చెందిన జి.వరలక్ష్మి, విద్యార్థినీ బి.కరుణ గాయపడ్డారు. ఆటో డ్రైవర్ చెల్లుబోయిన కష్ణమూర్తి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. గాయపడిన వారిని 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. నూకరత్నం మతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బిడ్డకు జన్మనివ్వాల్సిన తరుణంలో..
మరో మూడు నాలుగు రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన నూకరత్నం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో భర్త కనకరాజు భోరున విలపించాడు. కళ్లేదుటే భార్య ప్రమాదానికి గురై మరణించినా ఏమీ చేయలేకపోయానంటూ రోదించాడు. తన రెండేళ్ల కుమారుడు లిఖిత్‌ను పట్టుకుని కనకరాజు రోదిస్తున్న తీరును చూసిన వారు కంటతడిపెట్టారు. కనకరాజు చెంగల్రావుపేటలో నివాసం ఉంటున్నాడు. నాలుగేళ్ల కిందట మధురవాడ స్వతంత్రనగర్‌కు చెందిన నూకరత్నంతో వివాహమైంది. వీరికి రెండేళ్ల బాబు లిఖిత్ ఉన్నాడు. నూకరత్నం గర్భిణి కావడంతో స్వతంత్రనగర్‌లోని పుట్టింటికి వెళ్లింది. ప్రతి నెలా ప్రభుత్వ విక్టోరియా(ఘోషా)ఆస్పత్రికి పరీక్షల కోసం వచ్చి వెళ్తోంది. అదేమాదిరిగా శుక్రవారం ఉదయం ఆడపడుచు లక్ష్మిని వెంట పెట్టుకుని ఘోషాసుపత్రికి వెళ్లింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మరో మూడు, నాలుగు రోజుల్లో డెలివరీ కావచ్చని చెప్పారు. అక్కడి నుంచి చెంగల్రావుపేటలో ఉంటున్న భర్త కనకరాజు ఇంటికి వెళ్లి భోజనం చేశారు. అనంతరం కనకరాజు తన ఆటోలో మధురవాడలో ఉన్న అత్తింటికి బస్సులో పంపేందుకు వారిని జగదాంబ జంక్షన్‌కు తీసుకొచ్చాడు. అక్కడ రద్దీగా ఉండడంతో జడ్జికోర్టు వద్దకు తీసుకొచ్చాడు. బస్సు కోసం వేచి ఉన్న సమయంలో దారుణం జరిగిపోయింది. ఆర్టీసీ బస్సు నూకరత్నంతోపాటు గర్భస్థ శిశువు పాలిట మత్యువుగా మారింది. ఈ ప్రమాదంలో నూకరత్నం రెండేళ్ల కుమారుడు లిఖిత్, ఆమె ఆడపడుచు లక్ష్మి, కుమారుడు జస్వంత్ సురక్షితంగా బయటపడ్డారు. లక్ష్మి తన కుమారుడ్ని, కనకరాజు తన కుమారుడు లిఖిత్‌ను ఎత్తుకోవడంతో పిల్లలిద్దరూ దక్కారు.
ఆటో లేకపోతే..
ఆ సమయంలో అక్కడ ఆటో లేకపోయి ఉంటే ఐదారుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. బస్సు స్పీడును చాలా వరకు ఆటో ఆపగలిగింది. ఆటో వెనుక ఉన్న పలువురు ప్రయాణికులు దూసుకొస్తున్న బస్సును గమనించి వెనుక ఉన్న ఫుట్‌పాత్‌పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు
Advertisement
Advertisement