కార్పొరేట్‌కే సీఎం మొగ్గు
► ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడి ఆరోపణ
► ముగిసిన చైతన్య యాత్ర
కర్నూలు(ఓల్డ్‌సిటీ): చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ రంగాన్ని పెంచి పోషిస్తోందని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు పవన్ తేజ నూనె విమర్శించారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్లక్ష్యం చేస్తూ విద్య పేదలకు అందని ద్రాక్షగా మారుస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు ఇచ్చిన 34 వాగ్దానాలను విస్మరించి సంకల్ప సభ, నవ నిర్మాణ దీక్ష వంటి కార్యక్రమాలు నిర్వహించడం విచారకరమన్నారు.
ఒకవైపు కార్పొరేట్ విద్యా సంస్థలు బలోపేతమవుతుంటే.. మరోవైపు సంక్షేమ హాస్టళ్లలో వసతులు లేక, మెస్‌చార్జీల పెంపుతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ విద్యపై సర్కారుకున్న నిర్లక్ష్య భావాన్ని ఎండగట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్ర నిర్వహించామని, శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కర్నూలు జిల్లాతో ముగిసిందని వివరించారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్, జిల్లా బాధ్యుడు లోకేశ్, రాష్ట్ర నాయకుడు సతీశ్, యువజన కాంగ్రెస్ నాయకుడు ఖాసీం తదితరులు పాల్గొన్నారు.