డబుల్ ముగ్గు పడదా..?
Published Sat, Apr 22 2017 10:18 PM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
సాక్షి, మంచిర్యాల : పేదలకు సొంతింటి కల సాకారం చేయాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై అలుముకున్న నీలినీడలు వీడడం లేదు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వ భూమి సేకరించి, టెండర్లు ఆహ్వానించినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మంచిర్యాల జిల్లాకు 1,530 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరై నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం 150 ఇళ్ల నిర్మాణానికి మాత్రమే కాంట్రాక్టు సంస్థలు ముందుకొచ్చాయి.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం లాభసాటిగా లేదని కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి కూడా రాకపోవడంతో ఇటీవలే ప్రభుత్వం కొన్ని రాయితీలతో కూడిన సడలింపులు ఇచ్చింది. అయినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. దీంతో సొంతిళ్ల కోసం వస్తున్న వేలాది దరఖాస్తుల్లో కొన్నింటికైనా మోక్షం కలిగే అవకాశం లేకుండా పోయింది. ఇటీవల బెల్లంపల్లి పరిధిలో నిర్మించతలబెట్టిన 160 డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం మూడోసారి టెండర్లను ఆహ్వానించడం గమనార్హం.
గ్రామాల్లో 960... పట్టణాల్లో 570
జిల్లాకు మంజూరైన 1530 డబుల్ బెడ్ రూం ఇళ్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన విభజించారు. గ్రామీణ ప్రాంతాల్లో 960, పట్టణాల్లో 570 ఇళ్లను నిర్మించాల్సి ఉంటుంది. ఇందులో ఇప్పటివరకు 803 ఇళ్ల నిర్మాణానికి రోడ్లు, భవనాల శాఖ అధికారులు టెండర్లను పిలిచారు. ఈ మేరకు స్థల సేకరణ కూడా జరిగింది. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రిలలో ఇప్పటివరకు 17.3 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ మూడుచోట్ల 440 ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు.
అలాగే నెన్నెల, కన్నెపల్లి మండలాల్లో కూడా ఇప్పటికే స్థల సేకరణ జరిగింది. వీటిలో మంచిర్యాలలో నిర్మించతలబెట్టిన 120 ఇళ్లు, దేవాపూర్‌లో 30 ఇళ్లకు కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదిరింది. మిగతా చోట్ల డబుల్ ఇళ్ల కోసం ఇచ్చిన టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి సరైన స్పందన లేకపోవడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. తాజాగా ఆహ్వానించిన టెండర్లకైనా స్పందన వస్తుందేమోనని అధికార యంత్రాంగం భావిస్తోంది.
పెరిగిన నిర్మాణ ఖర్చులతో కాంట్రాక్టర్లు వెనక్కు..
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నిర్మాణ ధరలను నిర్ణయించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.04 లక్షలు, మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.6.29 లక్షలు. ఇక పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి రూ.5.35 లక్షలు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.75వేలు... వెరసి రూ. 6.05 లక్షలు కేటాయించారు. ఇళ్ల కేటాయింపులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జనాభా ప్రాతిపదికగా నిర్ణయించిన రిజర్వేషన్లనే పాటించనున్నారు.
అయితే నిర్మాణ రంగంలో పెరిగిన ధరలు, కూలీల రేట్ల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించలేమని కాంట్రాక్టర్లు చెపుతూ వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చే కాంట్రాక్టర్లకు రాయితీలతో కూడిన పలు సడలింపులు ఇచ్చింది. ఉచిత ఇసుక సరఫరా, రూ.230కే సిమెంటు బస్తా, స్వచ్ఛభారత్ కింద రూ.12వేల సబ్సిడీతో మరుగుదొడ్డి నిర్మాణం, ఉచిత ఫ్లైయాష్ సరఫరా వంటి రాయితీలు లభించనున్నాయి. అలాగే ఆరు శాతం ఉన్న సర్వీస్ ట్యాక్స్‌ను ఎత్తివేసిన ప్రభుత్వం ఈఎండీ, ఎఫ్‌ఎస్‌జీ రుసుముల్లో కూడా రాయితీలు ఇచ్చింది. అయినా పేద ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఆశించిన స్థాయిలో ముందుకు రాకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది.
150 ఇళ్లకు టెండర్లు ఓకే...
- కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్
మంచిర్యాల జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను సాధ్యమైనంత తొందరగా నిర్మించి ఇవ్వాలని భావిస్తున్నాం. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో కొంత ఆలస్యం జరిగింది. అయినా మంచిర్యాలలో 120, దేవాపూర్‌లో 30 ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. మిగతా ఇళ్లకు సంబంధించి టెండర్లు ఆహ్వానించాం. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సహాకాలతో కాంట్రాక్టర్లు ముందుకు వస్తారని భావిస్తున్నాం.
Advertisement
Advertisement