‘కాన్వాయ్’ బాబోయ్
‘నారా’ వారి కారు బకాయిలు రూ.35 లక్షలు
లోకేష్.. భువనేశ్వరిలకూ కార్లు పెట్టిన వైనం
గవర్నర్ వాహనాల పేరిటా అప్పులు
రూ.అర కోటి దాటిన కాన్వాయ్ బకాయిలు
మూడేళ్లుగా చిల్లిగవ్వ విడుదల చేయని కలెక్టర్
జిల్లాకు వచ్చే ప్రముఖులకు కాన్వాయ్ సమకూర్చే నిర్వాహకులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.అర కోటికి పైగా కాన్వాయ్ బకాయిలు పేరుకున్నాయి. వీవీఐపీల సేవలకు ఇక తమను పిలవొద్దని వాహన యజమానులు చెయ్యెత్తి దండం పెడుతున్నారు. వాహన శ్రేణిలో పాల్గొనడం మా తరంకాదంటూ హడలెత్తిపోతున్నారు. చిత్తూరు (అర్బన్): జిల్లాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్లు (వీవీఐపీ) వచ్చినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం కాన్వాయ్ (వాహన శ్రేణి) పెడుతున్నారు. ప్రముఖులు జిల్లాకు వచ్చి, వెళ్లేంత వరకు అద్దె వాహనాలను వాళ్ల వెంటే ఉంచుతారు. వీవీఐపీల పర్యటన పూర్తవగానే వాహనాలకు బాడుగ చెల్లిం చాలి. 2014నుంచి ఇప్పటివరకు కాన్వాయ్ అద్దెలు ఇవ్వకపోవడంతో బకాయిలు రూ.50 లక్షలకు చేరుకున్నాయి.
కాన్వాయ్ కోసం జిల్లా రవాణాశాఖను రంగంలోకి దింపే అధికారులు పని పూర్తవగానే ఎవరినీ లెక్కచేయడంలేదు. దీంతో వాహన యజమానులు, ట్రావెల్స్ నిర్వాహకులు కాన్వాయ్ పేరెత్తితే భయపడుతున్నారు. రా ష్ట్రపతి పర్యటనకు చెన్నై నుంచి తెలుపురంగు ఇన్నోవా వాహనాలు తెప్పించి వాటికి అప్పటికప్పుడే అద్దెలు చెల్లిస్తున్న జిల్లా యం త్రాంగం మన వాహనాలకు పైసా విదల్చడంలేదు. ఫైలు కలెక్టర్ వద్దకు పంపినా ఆయన పట్టించుకోవడంలేదనే ఆరోపణ వినిపిస్తోంది. దీనికి తోడు ఇటీవల వీవీఐపీల కాన్వాయ్‌కు వెళ్లే డ్రైవర్ల ఇళ్ల వద్దకు పోలీసులు విచారణ పేరిట అర్థరాత్రులు వెళ్లడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పగటిపూట రాకుండా అర్థరాత్రులు మందీ మార్బలంతో వస్తే చుట్టుపక్కల పరువు పోతోందని డ్రైవర్లు వాపోతున్నారు. ‘ మా అప్పు ఇవ్వకపోతే ఇకమీదట ఒక్క బండిని కూడా కాన్వాయ్‌కు పెట్టం. మూడేళ్లుగా ఏం తిని బతకాలి..?’ అని తిరుపతి చెందిన ట్రావెల్స్ నిర్వాహకులు ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘నారా’వారిదే రికార్డు...
2014లో 12సార్లు సీఎం హోదాలో చంద్రబాబు జిల్లాకు వచ్చారు. ప్రొటోకాల్ కాన్వాయ్ (వాహన శ్రేణి)కి రూ.3.75 లక్షలు బకాయిలు పడ్డారు. 2015లో 14సార్లు రావడంతో రూ.13. 32 లక్షలు, ఈ ఏడాది 12 సార్లు రావడంతో 15.78 లక్షలు కాన్వాయ్ పెట్టిన వాళ్లకు అద్దెలు రూపంలో బకాయి ఉన్నారు. ఇది చాలదన్నట్లు 2014 సెప్టెంబరు 26న సీఎం సతీమణి నారా భువనేశ్వరికి కాన్వాయ్ పెట్టినందుకు రూ.3600, గత నెల 16న సీఎం తనయుడు నారా లోకేష్‌కు వాహనాలు పెట్టినందుకు రూ.13,500 బకాయిలు పడ్డారు. కాన్వాయ్ బకాయిల్లో ఒక్క సీఎం కుటుంబమే రూ.35 లక్షల వరకు బకాయి పడింది.
వీవీఐపీలు మరెందరో...
వీళ్లు కాకుండా సింగపూర్ ప్రధాన మంత్రి, శ్రీలంక అధ్యక్షులు, ప్రధాన మంత్రి, తమిళనాడు, మేఘాలయ గవర్నర్లు, రాష్ట్ర డెప్యూటీ సీఎం, పశు సంవర్థక శాఖా మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మాజీ ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నాయకులు జిల్లాకు వచ్చినప్పుడు కాన్వాయ్‌లు ఏర్పాటు చేస్తే చిల్లి గవ్వ విడుదల కాలేదు. రాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టు, ఇతర రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల పేరిట కూడా కాన్వాయ్ బకాయిలు పేరుకున్నాయి.
గవర్నర్‌కూ ఓ కోటా...
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పేరిట కూడా కాన్వాయ్ బకాయిలు పేరుకున్నాయి. 2014లో గవర్నర్ పేరిట రూ.15,300, గత ఏడాది నాలుగు సార్లు జిల్లాకు వచ్చినందుకు రూ.1.16 లక్షలు, ఈ ఏడాది 5 సార్లు జిల్లాకు వచ్చిందుకు కాన్వాయ్ బకాయిల కింద రూ.1.38 లక్షలు అప్పులు పేరుకుపోయాయి.