కోచ్ డిపో వద్దే వద్దు..
కోచ్ డిపో వద్దే వద్దు..
Published Sat, Oct 1 2016 9:06 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
మెట్రో రైల్ సర్వేను అడ్డుకున్న రైతులు
వెనుదిరిగిన అధికారులు
టీడీపీ ప్రభుత్వంపై శాపనార్థాలు
రామవరప్పాడు :
నిడమానూరులో మెట్రో కోచ్ డిపో నిర్మాణం కోసం మెట్రో అధికారులు శనివారం చేపట్టిన సర్వేను రైతులు అడ్డుకున్నారు. గ్రామంలోని రైతులకు, ఎమ్మెల్యే వంశీ మోహన్‌కు సమాచారం ఇవ్వకుండా కొలతలు తీసుకోవడానికి రావడంతో రైతులు మండిపడ్డారు. సర్వే చేయడానికి వీలు లేదంటూ రైతులు నిరసన తెలిపారు. మెట్రో కోచ్ డిపోకు ఇక్కడి రైతులు వంద శాతం వ్యతిరేకిస్తున్నా పదే పదే కొలతలు, సర్వే పేరిట వచ్చి మనోవేదనకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మెట్రో కోచ్ డిపో వద్దంటే వద్దని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోకుండా బలంతపు భూసేకరణకు పాల్పడితే ఆత్మహత్యలే శరణ్యమంటూ అధికారులకు తేల్చి చెప్పారు. పొలాలను సర్వే చేయడానికి పోలీసు బలగాలతో వచ్చిన మెట్రో అధికారులు రైతులు అడ్డం తిరగడంతో చేసేదిలేక వెనుదిరిగారు.
కోట్లు విలువజేసే భూములు ఎలా ఇస్తాం..
గ్రామంలో మెట్రో కోచ్ డిపో నిర్మాణానికి సుమారు 60 ఎకరాలు కావాల్సి వస్తుందని, ఎకరం రూ.15 కోట్లు పలికే స్థలాన్ని ఎలా ఇస్తామని రైతులు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే ఓట్లు వేసి గెలిపించామని తీరా ప్రస్తుతం ఓట్లు వేసిన వారికే భూసేకరణ పేరుతో చంద్రబాబు వెన్నుపోటు పోడుస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నూటికి నూరు పాళ్లు కోచ్ డిపోకు రైతులు వ్యతిరేకంగా ఉన్నారని, అయినా రైతుల అభిప్రాయాలను ఏ మాత్రం పరిగణలోనికి తీసుకోకుండా టీడీపీ ప్రభుత్వం ఏకపక్ష ధోరణిను అవలంబిస్తుందని శాపనార్థాలు పెట్టారు.
Advertisement