అన్నదాతలను విస్మరించిన ప్రభుత్వం
-
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజం
-
మంత్రి ప్రత్తిపాటి వ్యాపారవేత్తే కానీ రైతు కాదని విమర్శ
-
దెబ్బతిన్న పంట చేలను పరిశీలించిన పార్టీ నేతలు
మేడికొండూరు : వ్యవసాయ శాఖ మంత్రి ఇలాకాలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాల వల్ల దగాపడ్డ మిర్చి రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మండల పరిధిలోని వెలవర్తిపాడు గ్రామంలో నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన మిర్చి పంట పొలాలను శుక్రవారం ఆయన పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో దాదాపుగా 400 ఎకరాల్లో జీవా కంపెనీకి చెందిన నాలుగు రకాల మిర్చి విత్తనాలతో నారు పోసి రైతులు పంట సాగు చేపట్టారన్నారు. ఈ విత్తనాలు ఉపయోగించిన 300 ఎకరాల్లో పంట పూర్తిగా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కంపెనీ విత్తనాలను ప్రభుత్వం నాణ్యత కలిగినవిగా నిర్ధారించిన తరువాతనే బహిరంగా మార్కెట్‌లో అమ్మకాలు ప్రారంభించాయని ఆయన గుర్తుచేశారు.
మంత్రి నోరు విప్పరేం?
ఇంత భారీగా పంట నష్టం జరిగినా ఇదే జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. మంత్రి సొంత నియోజకవర్గంలో కావేరీ కంపెనీకి చెందిన జాదు నకిలీ విత్తనాలు వేసి అక్కడి రైతులు నష్టపోయారని చెప్పారు. ఎకరాకు ఇప్పటికి రూ.40 వేలు వెచ్చించి రైతన్నలు సాగుబడి చేశారన్నారు. తక్షణం సంబంధిత సంస్థలపై చర్యలు చేపట్టి ముందస్తుగా రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందించి రైతు పక్షాన నిలబడాలని డిమాండ్ చేశారు. లేకుంటే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
నకిలీ విత్తన సంస్థలపై చర్యలేవీ?
పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ మేడికొండూరు మండలంలో భారీ ఎత్తున నకిలీ విత్తనాలతో రైతన్నలు నష్టపోతే సంబంధిత మిరప వంగడం సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. దీనినిబట్టి రైతులకు ఈ సర్కారు బాసటగా నిలవడం లేదని స్పష్టమవుతోందన్నారు. ఇప్పటికైనా సంబంధిత సంస్థల లైసెన్సులు రద్దు చేసి దగాపడ్డ రైతన్నలకు వెనువెంటనే ఆర్థిక సహాయం అందించాలని కోరారు. తద్వారా పదును పోకముందే మరో పంటను పండించుకునేందుకు రైతులకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి కావటి మనోహర్‌నాయుడు, గుంటూరు రూరల్ మండల జñ డ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు,నేతలు కందుల సిద్ధయ్య, సయ్యద్ హబీబుల్లా, జలగం రామకష్ణ, తిప్పరెడ్డి రామకష్ణారెడ్డి, తమనంపల్లి శాంతయ్య, ముత్యాల బాలస్వామి, ఉడత శ్రీనివాసరావు, ఆవుల సంజీవరెడ్డి, పాలపాటి రఘు, కొరివి చెన్నయ్య, చిన్న సాంబయ్య, కుళ్లారి సాగర్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు పూర్తి నష్టపరిహారం అందించాలి
విప్పర్ల (క్రోసూరు) : జిల్లాలో నకిలీ విత్తనాలు సాగు చేసి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం ఉలకటం లేదు, వరదలొచ్చి పంటలు పూర్తిగా నష్టపోతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉంది అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. మండలంలో వరద ముంపునకు గురై పంటలు కోల్పోయిన పీసపాడు, పారుపల్లి, విప్పర్ల, ఊటుకూరు, బయ్యవరం గ్రామాల్లోని బాధిత రైతులను కలిసి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం పార్టీ పెదకూరపాడు సమన్వయకర్త కావటి మనోహరనాయుడుతో కలిసి మండలానికి వచ్చిన మర్రి రాజశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మిర్చి విత్తనం జీవా కంపెనీ రకం సాగు చేసి రైతులు సుమారు 1600 ఎకరాల్లో నష్టపోయారని చెప్పారు. జీవా, కావేరీ విత్తనాలు సాగు చేసి నష్టపోయిన రైతులందరికీ పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు గుత్తికొండ అంజిరెడ్డి, సయ్యద్ అబ్దుల్ రహీం, సందెపోగు సత్యం, సాయిరెడ్డి, బెల్లంకొండ మీరయ్య తదితరులు పాల్గొన్నారు.