పరిహాసమే!
♦ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అందని పరిహారం
♦ బలవన్మరణాలు 831.. ఎక్స్‌గ్రేషియా 342 కుటుంబాలకే
♦ సంఖ్య తక్కువ చూపడం... చెల్లింపులో కొనసాగుతున్న నిర్లక్ష్యం
♦ పరిహారం రూ.లక్షన్నర నుంచి 6 లక్షలకు పెరిగినా చేరని ప్రయోజనం
♦ పలు జిల్లాల్లో పాత ప్యాకేజీ మంజూరు.. ఆవేదనలో రైతు కుటుంబాలు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్‌వర్క్: ఆరుగాలం శ్రమించి వేసిన పంటలు చేతికందక, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆపన్న హస్తం కరువైంది. వీరికి పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 831 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించి కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. అందులో 342 కుటుంబాలకు మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇచ్చినట్లు తెలిపారు. ఎక్స్‌గ్రేషియా చెల్లింపులో సర్కారు పూర్తిగా విఫలమైంది. అంతేగాకుండా పరిహారాన్ని రూ. లక్షన్నర నుంచి 6 లక్షలకు పెంచినా ఆ మొత్తం రైతు కుటుంబాలకు అందజేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటివరకు 342 మందిలో కేవలం 40 కుటుంబాలకే రూ. 6 లక్షల పరిహారం ఇచ్చినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో 65 మంది ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించి.. 43 మందికి పరిహారమివ్వగా... అందులో కేవలం 11 మందికే రూ. 6 లక్షల చొప్పున పరిహారం అందింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 53 మంది బలవన్మరణం చేసుకున్నట్లు తేల్చి.. 27 మందికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వగా... కేవలం ముగ్గురికే రూ. 6 లక్షల అందజేశారు. మిగిలిన వారికి రూ. లక్షన్నర చొప్పున పాత ప్యాకేజీ ప్రకారమే ఇచ్చారు.
1,800 మంది ఆత్మహత్య చేసుకుంటే...
ఖరీఫ్‌లో వేసిన పంటలు ఎండిపోగా, రబీలో పంటలు వేసే పరిస్థితే లేదు. ఫలితంగా అప్పులపాలైన రైతులు ఆత్మహత్యలే శరణ్యమంటూ తనువు చాలిస్తున్నారు. రైతు సంఘాలు వేసిన లెక్కల ప్రకారం 1,800 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు మాత్రం 831 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించాయి. ముఖ్యంగా పరిహారాన్ని 6 లక్షలకు పెంచాక నిబంధనలను కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యలు కాదని నిర్ధారించడానికే ఆ కమిటీలు పడరాని పాట్లు పడుతున్నాయన్న విమర్శలున్నాయి. ‘వ్యవసాయ సంబంధ ఆత్మహత్యలు కాదు’ అంటూ కొట్టిపారేస్తున్నాయి. ఉదాహరణకు ఒక రైతు పంటలు ఎండి అప్పుల పాలై వాటిని తీర్చలేక మానసిక వ్యధతో ఇంట్లో చిన్నచిన్న గొడవలు పడి ఆత్మహత్య చేసుకుంటే అటువంటి మరణాన్ని ‘కుటుంబ కారణాల వల్ల ఆత్మహత్య’ చేసుకున్నట్లుగా యంత్రాంగం లెక్కగడుతోంది. ఇటువంటివి కుటుంబ కలహాలుగా ఎలా లెక్కిస్తారని.. అప్పుల బాధ, ఎండిన పొలమే ఆత్మహత్యకు ప్రేరేపించిందని రైతు నేతలు చెబుతున్నారు.
ఒకే కుటుంబంలో ముగ్గురు...
ఏడాది కాలంలో మహబూబ్‌నగర్ జిల్లా మాగనూర్ మండలంలో నలుగురు రైతులు అప్పులతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయినా బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. మాగనూర్ గ్రామానికి చెందిన కటిక చెందెసాబ్(55), భార్య రసూల్‌బీ(50) దంపతులు రూ. 2 లక్షలు అప్పుచేశారు. పంటలు పండకపోవడంతో 2014 డిసెంబర్ 1న తమ పొలంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఒక్కగానొక్క కొడుకు మొగులాలు(25) కూడా ఐదు నెలల క్రితం మృతిచెందాడు. అయినా ఆ కుటుంబానికి ప్రభుత్వం ఎలాంటి సాయం ఇవ్వలేదు.
ఆదుకునే వారెవరు: బొందమ్మ
మహబూనగర్ జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన ఆవులమంద బుచ్చన్న(55) తనకున్న అరెకరంతో పాటు 4 ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. కరువుతో అప్పుల పాలై గత డిసెంబర్ 8న తనువు చాలించాడు. భర్త మరణించి 3 నెలలు కావస్తున్నా ఏ ఒక్క అధికారి తమను పలకరించిన పాపాన పోలేదని ఆ రైతు భార్య బొందమ్మ ఆవేదన చెందుతున్నారు.