ఐసీడీఎస్ అస్తవ్యస్తం
-
పనిచేయని ప్రీస్కూల్ మంత్రం
-
ఐదులోపు పిల్లలున్న కేంద్రాలు 300పైనే
-
నిద్రమత్తులో ఐసీడీఎస్
భీమదేవరపల్లి: అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ అస్యవ్యస్తంగా మారింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం..కిందిస్థాయి సిబ్బంది మామూళ్లకు అలవాటుపడడంతో వ్యవస్థ బలహీనపడింది. జిల్లాలో కొన్ని కేంద్రాలు మాత్రమే పిల్లలు, గర్భిణులు, బాలింతలతో సక్రమంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా చాలా కేంద్రాలు అధ్వానంగా ఉన్నాయి.
జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో సుమారుగా 300లకు పైగా కేంద్రాల్లో ఐదులోపు మాత్రమే పిల్లలు ఉన్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన సీడీపీవోలు, సూపర్‌వైజర్‌లు టూర్‌ల పేరిట సొంతపనులు చేసుకుంటున్నారు. ఇదే అదనుగా తీసుకుని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఇష్టానుసారంగా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. భీమదేవరపల్లి మండలం రాంనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో ఐదుగురు పిల్లలున్నట్లు రిజిస్టర్‌లో నమోదు ఉన్నప్పటికీ ఒకే ఒక్క చిన్నారి ఉంది. జిల్లాలో చాలా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.
16 ప్రాజెక్ట్‌లు
కరీంనగర్ అర్బన్, కరీంనగర్‌రూరల్, సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంథని, మహదేవపూర్, హుజూరాబాద్, భీమదేవరపల్లి, హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, గంగాధర, మల్యాల, జగిత్యాల, మెట్‌పల్లి మొత్తం 16 ప్రాజెక్ట్‌లున్నాయి. 3వేలకుపైగా అంగన్‌వాడీ కేంద్రాల్లో 45వేలకు పైగా చిన్నారులు ఉన్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లల సంఖ్య 15నుంచి 25 వరకు నమోదైనా హాజరుశాతం సగం కూడా ఉండడం లేదు.
పనిచేయని ప్రీస్కూల్
ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అంగన్‌వాడీలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టినా సత్ఫలితం లేదు. గతంలో ఆరేళ్ల వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యనభ్యసించే పిల్లలు నేడు నాలుగేళ్లకే ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో దాదాపు మూడేళ్లు నిండిన వారు సైతం అక్కడికే వెళ్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో విద్య భోదించాలనే నియమాలున్నప్పటికి ఆటవస్తువులు కనిపించడం లేదు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు అందించే పౌష్టికాహారం విషయంలోనూ అధికారుల పర్యవేక్షణ కరువైంది. నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించలేకపోతుండడంతో కేంద్రాల్లో భోజనం చేసేందుకు బాలింతలు, గర్భిణులు సుముఖత వ్యక్తం చేయడం లేదు.
ఇరువై కేంద్రాల్లో ఐదు లోపే..
– మార్పాటి సులోచన
భీమదేవరపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 217 కేంద్రాలున్నాయి. ఇందులో ఐదు లోపు పిల్లలున్న కేంద్రాలు 20కి పైగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో చాలా మంది అంగన్‌వాడీ పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు.