69 ఏళ్లలో దళితులకు ఒరిగిందేమీ లేదు
వర్గీకరణ విషయంలో ఏఎమ్మార్పీఎస్‌ది న్యాయమైన పోరాటం
–వెనుకబడిన కులాలు ఏకం కావాలి
–హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకాంత్, ప్రజా యుద్ధనౌక గద్దర్
ఆలేరు: స్వాతంత్య్రం సిద్ధించి 69 సంవత్సరాలు గడిచినా దళితులకు ఒరిగిందేమీ లేదని హైకోర్టు రిటైర్ట్ జడ్జి జస్టిస్ చంద్రకాంత్ అన్నారు. రాజ్యాంగ పరంగా ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలని పిలుపునిచ్చారు. మండలంలోని కొలనుపాకలో ఆదివారం ఎమ్మార్పీఎస్(టీఎస్) ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కోరుతూ మాదిగ చైతన్య పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో ఎమ్మార్పీఎస్ న్యాయమైన పోరాటం చేస్తుందన్నారు. వర్గీకరణ విషయంలో పాలకులు నాటకం ఆడుతున్నారని, పార్లమెంట్‌లో బిల్లును పెట్టేవరకు ఉద్యమించాలన్నారు. ప్రజయుద్ధనౌక గద్దర్ మాట్లాడుతూ వెనకబడిన కులాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో 85శాతం కులాలు వెనుకబాటుకు గురవుతున్నాయని, 15 శాతం కులాలు మాత్రమే ఆధిపత్యాన్ని చెలయిస్తున్నాయని పేర్కొన్నారు. కులవృత్తులు నానాటికీ కుంటుపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్(టీఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు సుంకపాక యాదయ్య, యాతాకుల భాస్కర్, జాతీయ గౌరవ అధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య, వైద్యులు ఆదాం, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.