అధికార పార్టీలో ఐటీ దాడుల ప్రకంపనలు
చిత్తూరు: చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభకు చెందిన సంస్థలు, ఇళ్లలో జరిగిన ఐటీ దాడుల్లో సుమారు రూ.43 కోట్ల లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నారన్న సమాచారం రాజకీయవర్గాల్లో సంచలనమైంది. వీటితో పాటు సుమారు రూ.267 కోట్లు విలువ చేసే ఆస్తులు స్వాధీనం చేసుకున్నామని ఆదాయపు పన్ను శాఖ అధికారులు బెంగళూరులో తెలిపారు.
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోపీపెట్టి దేశం నుంచి పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్యా వ్యవహారాల గురించి దర్యాప్తు చేస్తున్న అధికారులే సత్యప్రభ సంస్థలపై దాడులు జరపడంతో టీడీపీ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. విజయ్ మాల్యా కుటుంబానికీ.. డీఏ సత్యప్రభ కుటుంబానికీ అత్యంత సాన్నిహిత్యం ఉండటంతో ఆయన ఆస్తుల్లో చాలా భాగం సత్యప్రభ కుటుంబం పేరుతో బదలాయించారనే ఆరోపణలు రావడంతోనే ఆదాయపుపన్ను అధికారులు దాడులు నిర్వహించారని సమాచారం. రూ.267 కోట్లకు లెక్కలు చూపాలని సత్యప్రభకు ఐటీ అధికారులు తాఖీదులు ఇచ్చారు.
టీడీపీని కలవరపెడుతున్న ఐటీ దాడులు..
అధికార టీడీపీని ఐటీ దాడులు కలవర పెడుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, సంస్థల్లో సోదాలు నిర్వహించడంతో వారు కక్కలేక మింగలేక వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఐటీ దాడులు జరగడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అవినీతిపై ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోస్తున్న దశలో టీడీపీలోనే అవినీతి చేపలు ఆదాయపన్ను అధికారులకు అడ్డంగా దొరికిపోవడంతో ఆ పార్టీ గుండెల్లో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది.