పాదయాత్ర పై కుతంత్రాలు
►జనాభిమానం మధ్య విజయవంతంగా సాగుతోన్న జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర
►ఓర్వలేక అడ్డుకునేందుకు అధికార పార్టీ కుతంత్రాలు
►ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఎమ్మెల్సీ శమంతకమణి యత్నం
►హౌస్ అరెస్టు చేసిన పోలీసులు... ఆపై పాదయాత్ర ఆపేందుకు విశ్వప్రయత్నాలు
►పోలీసుల వ్యవహారంతో వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు
►పాదయాత్రను అనుసరించిన 300 మందికి పైగా పోలీసులు
►ఆపేది లేదని పద్మావతి స్పష్టీకరణ
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) నాలుగేళ్లుగా వరుస కరువులు వెంటాడుతున్నాయి. శింగనమల నియోజకవర్గంలో హెచ్చెల్సీ కింద దాదాపు 80వేల ఎకరాల ఆయకట్టు బీడు పడింది. హంద్రీ–నీవా ద్వారా 28 టీఎంసీల నీరు వచ్చినా ఒక ఎకరాకు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో తాగు, సాగునీరిచ్చి నియోజకవర్గ ప్రజలు, రైతులను కాపాడాలంటూ జిల్లా కలెక్టర్‌కు పలు వినతులు ఇచ్చారు. ధర్నాలు, ఆందోళనలు కూడా చేపట్టారు. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు. ప్రభుత్వ చర్యలతో నష్టపోతున్న రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ చూసి.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ‘మేలుకొలుపు’ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. వారం రోజులుగా విజయవంతంగా సాగుతోన్న పాదయాత్రలో ప్రజలు భారీగా భాగస్వాములవుతున్నారు. అడుగడుగునా సమస్యలు ఏకరువు పెడుతున్నారు. దీంతో ఎలాగైనా పాదయాత్రను నిలిపేయించాలని ప్రభుత్వం కుట్ర పన్నింది.
పోలీసులను ప్రయోగించి ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. పాదయాత్రను ఆపేందుకు వందలాదిగా పోలీసులు రాగా...వేలాదిగా తరలివచ్చిన ప్రజలు తమ అభిమాన నేతకు ‘రక్షణ వలయం’గా నిలిచారు. పాదయాత్ర ఏడోరోజైన గురువారం శింగనమల మండలం ఈస్ట్‌నర్సాపురం నుంచి మొదలైంది. మధ్యాహ్నం నిదనవాడలో భోజన విరామం తీసుకున్నారు. సాయంత్రం తిరిగి పాదయాత్రకు ఉపక్రమించారు. ఉన్నపళంగా సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్‌ఐ హమీద్‌లు తమ సిబ్బందితో వచ్చి యాత్రను ఆపాలని పద్మావతికి సూచించారు. ఎందుకని ఆమె ప్రశ్నించారు. బుధవారం పాదయాత్రలో ముసలప్ప అనే వ్యక్తి చేతిలోని రివాల్వర్ మిస్‌ఫైర్ అయిందని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలంటే యాత్ర ఆపాలని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసుల అనుమతితోనే పాదయాత్ర చేస్తున్నామని, తుపాకీ మిస్‌ఫైర్‌కు, యాత్ర ఆపేందుకు సంబంధం ఏంటని ప్రశ్నిం చారు. పోలీసుల తుపాకులు కూడా ఎన్నోసార్లు మిస్‌ఫైర్ కాలేదా అని అడిగారు.
ఇంతలో అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ కూడా వచ్చి యాత్రను నిలిపేయాలన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆపే ప్రసక్తే లేదని పద్మావతి తేల్చిచెప్పారు. ఇదే సందర్భంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, రైతువిభాగం రాయలసీమ కన్వీనర్ తరిమెల శరత్‌చంద్రారెడ్డి డీఎస్పీతో మాట్లాడారు. తమపై తీవ్ర ఒత్తిడి ఉందని, యాత్ర ఆపాలని డీఎస్పీ చెప్పారు. వారు కుదరదన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో మైకులు వినియోగించకూడదని, తరిమెలలో సభ నిర్వహించకూడదని, డప్పులు కొట్టకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. చివరకు నాయకుల కార్లు కూడా వెళ్లకుండా ఆపేసి నడిచివెళ్లాలని హుకుం జారీ చేశారు. పోలీసుల షరతులకు అంగీకరించి.. తిరిగి పాదయాత్రను మొదలెట్టారు.
తరిమెలలో ఉద్రిక్తత : తరిమెలకు దగ్గరలో మరోసారి యాత్రను ఆపేయాలన్నారు. దీంతో పద్మావతితో పాటు పార్టీ శ్రేణులు, ప్రజలు రోడ్డుపై బైఠాయించి పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తరిమెల గ్రామస్తులు కూడా భారీగా తరలివచ్చారు. చూస్తుండగానే కిలోమీటరు మేర జనం పోగయ్యారు. పోలీసులు కూడా భారీగానే ఉన్నా యాత్రను నిలువరించలేకపోయారు. తరిమెలకు చేరుకునే సరికి రాత్రి ఏడు గంటలైంది. గ్రామంలో మహిళలు అడుగడుగునా పద్మావతికి దిష్టితీసి హారతులు పట్టారు. ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ భోజనాలు చేయకూడదని, గ్రామం దాటిన తర్వాత చేసుకోవాలని పోలీసులు ఆదేశించారు. కుదరదంటూ శరత్‌చంద్రారెడ్డి ఇంటివద్ద భోజనాలకు ఉపక్రమించారు. ఈ వ్యవధిలో మరో 5– 6 బస్సులు, 15–20 జీపుల్లో పోలీసులను రప్పించారు. వారిలో మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. దీంతో తరిమెలలో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. పద్మావతిని అరెస్టు చేస్తారేమోనన్న ఆందోళనతో గ్రామం మొత్తం తలుపులు వేసి ఆమె వద్దకు చేరుకున్నారు. రాత్రివేళ కూడా వేలాది మంది మధ్య ఇల్లూరు వరకూ యాత్ర సాగింది. 300మంది దాకా పోలీసులు పాదయాత్రను అనుసరించారు.
ప్రభుత్వ ఆదేశాలతోనే.. : పాదయాత్రకు ప్రజా స్పందనను చూసి బెదిరిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి ఎలాగైనా యాత్రను ఆపాలని కంకణం కట్టుకున్నారు. అనంతపురం చెరువు వద్ద పోలీసులను కలిసి యాత్రను ఆపుతారా? లేదంటే తామే వెళ్లి అడ్డుకోవాలా? అని శమంతకమణి తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి ఇంటికి పంపి హౌస్ అరెస్టు చేశారు. దీంతో రాజధాని నుంచి కూడా పోలీసులపై ఒత్తిడి తెప్పించారు. ఈ క్రమంలోనే యాత్రను నిలిపేందుకు వారు శతవిధాలా యత్నించారు.