గబ్బుకొడుతోంది.. ఏం చేస్తున్నారు ?
విజయవాడ సెంట్రల్ : ‘సీఎం చంద్రబాబు తరచూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సౌకర్యాలు చూస్తే అధ్వానంగా ఉన్నాయి. గబ్బుకొడుతోంది. ఏం చేస్తున్నారు. మీ పనితీరు ఇంత బాగున్నదనమాట..’ అంటూ నగరపాలక సంస్థ అధికారులపై మేయర్ కోనేరు శ్రీధర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన గురువారం అధికారులతో కలిసి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని పరిశీలించారు. బూజు పట్టిన గదులు, గబ్బుకొడుతున్న టాయ్‌లెట్స్‌ను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘స్వచ్ఛభారత్ గురించి మనమే ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ చూస్తే గబ్బు కొడుతోంది. స్టేడియం, పరిసర ప్రాంతాలను వెంటనే శుభ్రం చేయండి..’ అని ప్రజారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలా కనిపిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. స్టేడియంలో ఏయే గదులు ఎవరెవరకి కేటాయించారో నివేదిక ఇవ్వాలని ఇన్‌చార్జిని ఆదేశించారు. ఇంజినీరింగ్ విభాగం స్టోర్ రూమ్‌గా వినియోగిస్తున్న గదిని యోగా నిర్వహణకు కేటాయించాలని చెప్పారు. స్టేడియం ఇన్‌చార్జి, Ðð టర్నటీ అసిస్టెంట్ సర్జన్ ఎన్.శ్రీధర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ సీహెచ్ రామకోటేశ్వరరావు, యోగా టీచర్ జి.సూర్యచంద్ర కుమారి తదితరులు పాల్గొన్నారు.