మళ్లీ రెచ్చిపోయిన ఎమ్మెల్యే చింతమనేని
♦ కానిస్టేబుల్‌ను చితక బాదిన టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్
♦ బండబూతులు తిట్టి గదిలో నిర్బంధించడమేగాక ఆనక రోడ్డుమీదకు ఈడ్చిన వైనం
♦ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో దారుణం
♦ తన అనుయాయుల స్థలాలకు దారి ఇవ్వాలంటూ కానిస్టేబుల్‌పై ఒత్తిడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై తరచూ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడే ప్రభాకర్ తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు. ఓ స్థలం వ్యవహారంలో అడ్డు తగులుతున్నాడనే కారణంతో ఏలూరు త్రీటౌన్‌కు చెందిన కానిస్టేబుల్ మధు(ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు)పై ప్రతాపం చూపారు. అనుచరులతో కలసి నేరుగా కానిస్టేబుల్ ఇంటిపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే అతనిపై చేయి చేసుకున్నారు. గదిలో నిర్బంధించి నానాదుర్భాష లాడారు. పత్రికల్లో రాయలేని భాషతో తిట్టిపోశారు. కానిస్టేబుల్‌ను ఈడ్చితన్నారు.
అనుచరులతో ఇంట్లోనుంచి బయటకు ఈడ్చుకొచ్చి రోడ్డుపై పడేశారు. స్థానిక ఎస్‌ఐ, తహశీల్దార్ సాక్షిగా ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇసుక మాఫియాలో కీలకంగా ఉన్న ఎమ్మెల్యే చింతమనేని తన దందాను అడ్డుకున్నారన్న కారణంగా కొద్దికాలంక్రితం కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై దాడి చేయడం తెలిసిందే. ఈ ఘటనను మరువకముందే ఆయన తాజాగా ఈ దాడికి పాల్పడడం గమనార్హం. ఈ వ్యవహారం ఏలూరు, దెందులూరుల్లో కలకలం ఎస్సై ఎంవీ సుభాష్, తహశీల్దార్ మహమ్మద్ నసీరుద్దీన్ షా అక్కడే ఉన్నా.. ఏమీ చేయలేకపోయారు. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన మధు తర్వాత తేరుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. అక్కడేఉన్న పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. తదుపరి మధు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్‌కు ఫోన్ చేయగా.. వెంటనే ప్రభుత్వాసుపత్రిలో చేరి చికిత్స చేయించుకోవాలని ఆయన సూచించారు. ఘటనపై విచారణ చేపట్టి న్యాయం చేస్తామని భరోసాఇచ్చారు. అనంతరం మధు తన భార్యతో కలసి ఏలూరు ప్రభుత్వాసుత్రిలో చేరారు.
అతనే నన్ను తిట్టాడు: చింతమనేని
ఘటనానంతరం ప్రభుత్వాసుపత్రికి వ్యక్తిగత పనుల మీద వచ్చిన చింతమనేని మీడియాతో మాట్లాడారు. ‘నేను అతని(కానిస్టేబుల్ మధు)పై దాడి చేయలేదు. ఎమ్మెల్యేనని కూడా చూడకుండా అతనే నన్ను తిట్టాడు.. ఉమ్మడి రహదారి వివాదం పరిష్కరించడానికి వెళ్తే నాపైనే వ్యక్తిగత విమర్శలకు దిగాడు. అందుకనే మా వాళ్లు ఆవేశపడ్డారు’ అని అన్నారు.
సీఎం, స్పీకర్ జోక్యం చేసుకోవాలి: మధు
సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే చింతమనేని అరాచకాల్ని అరికట్టాలని బాధిత కానిస్టేబుల్ మధు విజ్ఞప్తి చేశారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చింతమనేనిపై మండిపడ్డారు. చింతమనేని బతుకంతా బయటపెడతానని ప్రకటించారు. వ్యక్తిగత వివాదాల జోలికి ఎమ్మెల్యే ఎందుకు రావాలని ప్రశ్నించారు.