క్యాష్‌లెస్ వైపు అడుగులు
జిల్లాలో నాలుగు గ్రామాలు ఎంపిక
ఆ గ్రామాల్లోని అన్ని కుటుంబాలలో నగదు రహిత లావాదేవీలు
నిజామాబాద్ : నగదు రహిత లావాదేవీల వైపు అడుగులు పడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ నగదు రహిత లావాదేవీల ప్రాధాన్యతపై గ్రామీణ స్థాయిలో అవగాహన కల్పించే దిశగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లాలో నాలుగు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకుంది. ఆయా గ్రామాల్లో ప్రతి కుటుంబం ప్రత్యక్షంగా నగదు రహిత లావాదేవీలు జరిపేలా చర్యలు చేపట్టింది. నగదు రహిత లావాదేవీలతో ఉన్న ప్రయోజనాలను ప్రత్యక్షంగా అవగాహన కలిగేలా చర్యలు చేపట్టింది. ఇలా మొదటి విడతలో తుంగిని, బాదన్‌పల్లి, దోమలెడిగి, కేశారం గ్రామాలను పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇప్పటికే తుంగిని గ్రామంలో ఉన్న సుమారు 180 కుటుంబాలతో సుమారు 400 లావాదేవీలు జరిపించారు. అంటే ఒక్కో కుటుంబం నుంచి కనీసం రెండు నగదు రహిత లావాదేవీలు జరిపించారు. అలాగే కేశారం గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో అన్ని కుటుంబాలు కనీసం రెండు చొప్పున నగదు రహిత లావాదేవీలు జరిపించారు. అలాగే దోమలెడిగి, బాదన్‌పల్లిలో కూడా అన్ని కుటుంబాలతో నగదు రహిత లావాదేవీలు జరిపేలా చర్యలు చేపట్టింది. ఇలా మరో 31 గ్రామాలను ‘క్యాష్ లెస్’ గ్రామాలు గా చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.
ఆధార్ ఎనేబుల్డ్ ద్వారా..
పేటీఎం వంటి యాప్‌లు స్మార్ట్‌ఫోన్ ఉన్న వారితో మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు వీలుంటుంది. కానీ గ్రామాల్లో అందరి వద్ద స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండవు. దీంతో ఆధార్ ఎనేబుల్డ్ విధానం ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. ఆయా బ్యాంకుల కరస్పాండెంట్లను నియమించి, వేలిముద్రల ద్వారా ఈ లావాదేవీలు జరుపుతున్నారు. రేషన్‌షాపులు, కిరాణా దుకాణాల్లో ఈ విధానం ద్వారా లావాదేవీలు జరిగేలా చూస్తున్నారు. ఇటీవల ఈ గ్రామాల్లో కొందరు రేషన్ కార్డుదారులు కిరోసిన్‌ను ఇలా నగదు రహిత లావాదేవీల ద్వారానే పంపిణీ చేసినట్లు జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి ‘సాక్షి’తో తెలిపారు.
బ్యాంకు కరస్పాండెంట్ల కొరత
జిల్లాలో పూర్తి స్థాయిలో బ్యాంకు కరస్పాండెంట్లు లేకపోవడంతో నగదు రహిత లావాదేవీలు పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు వీలు పడటం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేవలం సుమారు రెండు వందలకు మించి బ్యాంకు కరస్పాండెంట్లు లేరు. ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ, గ్రామీణ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, విజయ బ్యాంకులకు మాత్రమే బ్యాంకు కరస్పాండెంట్లు ఉన్నారు. బ్యాంకు కరస్పాండెంట్లు ఎక్కువ మంది ఉంటే ఈ నగదు రహిత లావాదేవీలు విస్తృతంగా జరిపేందుకు వీలు పడుతుంది. ఈ కరస్పాండెంట్ల నియామకాలు చేపట్టేలా బ్యాంకులపై అధికార యంత్రాంగం ఒత్తిడి తెస్తోంది.