పింఛన్ కోసం వెళ్తూ వృద్ధుడి మృతి
రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్‌లో పింఛన్ డబ్బుల కోసం బ్యాంకుకు బయలుదేరిన వృద్ధుడు మార్గమధ్యంలోనే బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. తిర్మలాపూర్‌కి చెందిన కురుమల్ల నారాయణ(75) పింఛన్ డబ్బుల కోసం బుధవారం మధ్యాహ్నం గాధర మండలం బూరుగుపల్లిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు కాలినడకన బయలుదేరాడు.
తిర్మలాపూర్ నుంచి బూరుగుపల్లి సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. గ్రామ శివారులోకి చేరుకోగానే ఒక్కసారి చెమటలు పట్టి గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. నారాయణ అక్టోబర్ నెల పింఛన్ కోసం మూడు రోజుల నుంచి బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు లేవని చెప్పడంతో నిరాశతో ఇంటికి వస్తున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.