గిరిజనుల మధ్య ‘పచ్చ’చిచ్చు | pacha chichu | Sakshi
Sakshi News home page

గిరిజనుల మధ్య ‘పచ్చ’చిచ్చు

Published Tue, Sep 20 2016 9:45 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

గిరిజనుల మధ్య ‘పచ్చ’చిచ్చు - Sakshi

గిరిజనుల మధ్య ‘పచ్చ’చిచ్చు

– ఏజెన్సీలో చట్టాలకు తూట్లు
– పోలీసుల చెంత పంచాయితీలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
అధికార పార్టీ నేతలు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులనూ వదలడం లేదు. నిర్వాసితులకు కేటాయించిన భూముల్లో దందాలు చేయడంతోపాటు గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిమధ్య చిచ్చు పెడుతున్నారు. దీంతో గిరిజనులు, నిర్వాసిత గిరిజనుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. పోలీస్‌ స్టేషన్ల వరకూ పంచాయితీలు వెళ్తున్నాయి. ఫలితంగా గిరిజన తండాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. వివరాల్లోకి వెళితే.. జీలుగుమిల్లి మండలంలోని జీలుగుమిల్లి, దర్భగూడెం, పి.అంకంపాలెం, కామయ్యపాలెం, రాచన్నగూడెం, అంకన్నగూడెం, పూచికపాడు గ్రామాల్లో ప్రభుత్వం వందలాది ఎకరాలను కొనుగోలు చేసింది. పలుచోట్ల ఆ భూములను ఇంకా ఎవరికీ కేటాయించలేదు. స్థానిక టీడీపీ నాయకులు కొందరు ఆ భూముల్లో దర్జాగా సాగు చేసుకుంటున్నారు. నిర్వాసితులకు ఇప్పటికే దఖలు పరిచిన భూముల్లో వారు పంట పండించుకోవాలన్నా, వేరే వ్యక్తులకు కౌలుకు ఇవ్వాలన్నా స్థానిక టీడీపీ నేతల అనుమతితోనే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ భూములను గిరిజనుల నుంచి టీడీపీ నేతలు కౌలుకు తీసుకుని ఎకరానికి రూ.3 వేల చొప్పున చెల్లిస్తున్నారు. అవే భూములను బయటి వ్యక్తులకు కౌలుకు ఇస్తూ ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆ భూములను వేరే వారికి కౌలుకు ఇద్దామంటే టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. గిరిజనుల నుంచి నేరుగా భూముల్ని కౌలుకు తీసుకున్న వ్యక్తులను ఆ భూముల్లోకి అడుగు పెట్టనివ్వడం లేదు. జీలుగుమిల్లి మండలం యర్రవరం గ్రామస్తులకు పి.నారాయణపురంలో 18 ఎకరాల భూమిని భూమికి భూమిగా కేటాయించారు. ఈ భూమిపై గతంలోనే ఎల్‌టీఆర్‌ కేసు నమోదు కాగా, ఆ భూముల్ని అప్పటినుంచి స్ధానిక గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పి.నారాయణపురంలో స్థానిక గిరిజనులు, పోలవరం నిర్వాసిత గిరిజనుల మధ్య భూ వివాదం చోటుచేసుకుంది. స్థానిక గిరిజనులు వేసిన పత్తి పంటను నిర్వాసిత గిరిజనులు పోలీస్‌ సమక్షంలో దున్నేశారు. దీంతో ఆగ్రహించిన స్థానిక గిరిజనులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఇదిలావుండగా, దర్భగూడెంలో గిరిజనుల సాగులో ఉన్న భూముల కొనుగోలుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయడం వివాదాస్పదమైంది.
ఒకే భూమి ముగ్గురికి..
రాచన్నగూడెం రెవెన్యూ పరిధిలో పోలవరం నిర్వాసితులకు కోస
ం కొనుగోలు చేసిన 90 ఎకరాలను కౌలుకు తీసుకోవడానికి ముగ్గురు పోటీ పడ్డారు. అధికార పార్టీకి చెందిన నాయకుడొకరు ఆ భూములను ఉపాధ్యాయునితోపాటు మరో ఇద్దరికి ఒకరికి తెలియకుండా మరొకరికి కౌలుకు ఇచ్చేశారు. ఆ ముగ్గురూ సాగు నిమిత్తం ఆ భూముల్లోకి వెళ్లగా అసలు విషయం తెలిసింది. దీంతో ఆ ముగ్గురూ గ్రామంలో పంచాయితీ పెట్టారు. ఆ భూముల్ని పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఉద్యోగస్తులకు కౌలుకు ఇవ్వడం ఏమిటని కొందరు నాయకులు గట్టిగా నిలదీయడంతో ఆ భూమి వ్యవహారం పెండింగ్‌లో పడింది.
 
ఉద్యోగి సాయంతో..
పోలవరం నిర్వాసితుల కోసం సేకరించి, నిర్వాసితుల్లో కొందరికి కేటాయించిన భూములను కౌలుకు ఇచ్చే విషయంలో జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న  ఉద్యోగి ఒకరు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  డివిజన్‌ పరిధిలోని భూముల కౌలు అప్పగింత వ్యవహారాలన్నీ టీడీపీ నేతలు అతని చేతుల మీద సాగిస్తున్నారు. ఆ ఉద్యోగి ఇటు టీడీపీ నేతలకు, అటు అధికారులకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అందినకాడికి స్వాహా చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement