నొప్పించక...తానొవ్వక...
-
ఆద్యంతం హావభావాలతో సాగిన పవన్ కల్యాణ్ ప్రసంగం
-
బీజేపీ పైనా బాణాలు, బాబు ప్రస్తావన లేకుండా జాగ్రత్తలు
-
తరువాత సభ ఎక్కడో ప్రకటించని వైనం
-
సభా ప్రాంగణంలో విద్యుదాఘాతంతో ఒకరి మృతి, నలుగురికి గాయాలు
సాక్షిప్రతినిధి, కాకినాడ :
సీమాంధ్రుల ఆత్మగౌరవం పేరుతో శుక్రవారం కాకినాడలో నిర్వహించిన సభలో జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రసంగం ఆద్యంతం ‘నొప్పించక తానొవ్వక’ అన్న రీతిలో సాగింది. కాకినాడ జేఎన్‌టీయూ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో పవన్ సాయంత్రం నాలుగు గంటల నుంచి గంట పాటు ప్రసంగించారు. ఈ సదస్సు కోసం గురువారం రాత్రే జిల్లాకు వచ్చిన పవన్ జీఆర్‌టీ గ్రాండ్ హోటల్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం నుంచి హోటల్ వద్దకు అభిమానులు తరలిరావడంతో పోలీసులు నిలువరించడానికి నానాపాట్లు పడాల్సి వచ్చింది. పవన్ బస చేసిన హోటల్ నుంచి జెఎన్‌టీయూ గ్రౌండ్స్ వరకు దారిపొడవునా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశాయంటూ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లే లక్ష్యంగా పవన్ ప్రసంగం సాగింది. పవన్ విమర్శల వేడి ఇతర పార్టీలకంటే భారతీయ జనతాపార్టీపైనే ఎక్కు పెట్టారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు నినాదాన్ని తీసుకువచ్చిన బీజేపీ ఇప్పుడు హోదా ఇవ్వమంటే ఆర్థిక సంఘం సిఫార్సులు లేవని కుంటిసాకులు చూపిస్తోందంటూ బీజేపీ తీరును పవన్ ఈ సందర్భంగా గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. హోదా ఇవ్వమంటే రెండు పాచిపోయిన లడ్డూలను ఇచ్చిపోయారు, వాటిని మీరు తీసుకుంటారా లేదా విసిరేస్తారో తేల్చుకోవాలని సీఎం చంద్రబాబుకు పవన్ సూచించారు. కానీ అదే సమయంలో సీఎం చంద్రబాబుపై పవన్ విమర్శలు సాదాసీదాగా సాగడం అభిమానుల్లో ఒకింత నిరుత్సాహాన్ని కలిగించింది.
కాకినాడలో తొలి సదస్సు నిర్వహించి ఆ తరువాత జిల్లాల వారీగా సదస్సులుంటాయని గత నెల తిరుపతి సభలో పవన్ ప్రకటించారు. ఈ క్రమంలో కాకినాడ సదస్సులో అనంతరం ఏయే తేదీల్లో ఎక్కడెక్కడ సదస్సులు నిర్వహిస్తారో ప్రకటిస్తారని ఎదురుచూశారు. తీరా ఆ ఊసే ఎత్తకుండా తన ఉపన్యాసాన్ని ముగించారు. ప్రకటన మరిచిపోయారా లేక, మరేదైనా రాజకీయం ఉందా అనేదానిపై అభిమానుల్లో చర్చించుకుంటున్నారు. ఒకవేళ మరిచిపోయినా మళ్లీ వెనక్కి పరుగెత్తుకు వచ్చి ప్రకటిస్తారు. అదీ చేయకపోవడంతో కావాలనే ఆ ప్రకటనను విస్మరించారని భావిస్తున్నారు. సినిమాల్లో మాదిరిగా పవన్ పంచ్ డైలాగులతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సదస్సు ప్రారంభంలో కాకినాడ కాజా, తాపేశ్వరం కాజాలను ప్రస్తావించడంతో అభిమానులు కేరింతలుకొట్టారు. అభిమానంతో వేదిక కింద నుంచి అభిమానులు వేసిన ఎర్ర కండువాలను తీసుకుని మెడలో వేసుకున్నారు. కొద్దిసేపటి తరువాత వాటిని గాలిలో గిరాటువేసి వారికే ఇచ్చేశారు. ఎంపీలు వెంకయ్యనాయుడు, మురళీమోహన్, అవంతి శ్రీనివాస్, టీజీ వెంకటేష్‌లపై వాగ్భాణాలు సంధించినట్టే సంధించి వారంటే తనకు ఎంతో గౌరవం ఉందని ముక్తాయించారు.
ఎస్పీ రవిప్రకాష్, అదనపు ఎస్పీ దామోదర్ దగ్గరుండి పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. పోలీసులు భారీగా మోహరించినప్పటికీ అభిమానులను కట్టడిచేయలేక చేతులెత్తేశారు. పోలీసు వలయాలను సైతం ఛేదించుకుని గ్రౌండ్‌లో బారీకేడ్లను దాటేశారు. సదస్సుకు హాజరైన కాజులూరు మండలం కుయ్యేరుకు చెందిన యువకుడు నందికోళ్ల వెంకటరమణ మృతి చెందగా, మరో నలుగురికి అభిమానులు గాయాలపాలవడం విషాదం చోటుచేసుకుంది.