ఏ ముప్పు ముంచుకొచ్చేనో? | People Fearing in coastal Andhra | Sakshi
Sakshi News home page

ఏ ముప్పు ముంచుకొచ్చేనో?

Published Thu, Dec 3 2015 2:53 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM

ఏ ముప్పు ముంచుకొచ్చేనో? - Sakshi

ఏ ముప్పు ముంచుకొచ్చేనో?

బిక్కుబిక్కుమంటున్న ఆంధ్రా తీరప్రాంతాలు
 
 చెన్నైని చిత్తుచేసిన వరుణుడు ఆంధ్రప్రదేశ్‌వైపే చూస్తున్నాడా?  ఇంకా నాలుగైదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ జారీ చేస్తున్న హెచ్చరికలు వింటుంటే ఏపీకీ ముప్పు తప్పేలా కనిపించడంలేదు. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వాన బీభత్సం మొదలైంది. అల్పపీడనం మరింత బలపడితే ఈ మూడు జిల్లాల పరిస్థితి మరింత దయనీయంగా మారడంతోపాటు కడప, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు తీవ్ర నష్టం కలిగే అవకాశముందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు ప్రజలు అప్రమత్తమైతేనే నష్టాన్ని వీలైనంత తగ్గించుకోవచ్చు.     -సాక్షి ప్రతినిధి, నెల్లూరు/చిత్తూరు/ఒంగోలు
 
 భయం గుప్పెట్లో నెల్లూరు
 శ్రీపొట్టిశ్రీరామలు నెల్లూరు జిల్లాలో ముంపుకు గురవుతున్న ప్రాంతాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మహోగ్రరూపందాల్చిన నదులు, కట్టలు తెంచుకుంటున్న కాలువలు, చెరువులకు గండ్లు పడుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలేకాదు సమీప ప్రాంతాల్లోనివారంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీటమునిగి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పండ్లతోటల్లోకి మళ్లీ వరద నీరు చేరుతోంది. వేలాది ఎకరాల్లో వరి ఇప్పటికే నీటమునిగింది.

 నదుల ఉగ్రరూపం: నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు స్వర్ణముఖి నది ఉగ్రరూపం దాల్చింది. వాకాడు సమీపంలోని స్వర్ణముఖి బ్యారేజ్ 24 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. సోమశిల రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా రిజర్వాయర్ నీటిమట్టం 68 టీఎంసీలకు చేరింది. రేపటికి 70 టీఎంసీలు దాటవచ్చని అంచనా. పెన్నా, కాళంగి, కైవల్యా నదులతోపాటు పాముల, దొండ, మల్లికాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూళ్లూరుపేట-శ్రీకాళహస్తి రోడ్డు వరద ఉధృతికి తెగిపోయింది. అలాగే సూళ్లూరుపేట-కోటకు వెళ్లే రహదారి సైతం కోతకు గురైంది. దీంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు ప్రమాదకరంగా మారడంతో గండ్లుకొట్టి నీటిని కిందకు వదిలేస్తున్నారు. ఇప్పటికి 11 చెరువులకు గండ్లు కొట్టారు.

 జిల్లావ్యాప్తంగా అదే పరిస్థితి..
► నాయుడుపేట నియోజకవర్గంలో వరద నీరు పంటపొలాలను ముంచెత్తింది. 5వేల ఎకరాల పంట నీటమునిగింది.
► గూడూరు నియోజకవర్గంలో గూడూరు-ఇందూరు మధ్య కైవల్యానది బ్రిడ్జిపై 5 అడుగుల మేరు నీరు ప్రవహిస్తోంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
► వాకాడు మండలంలో స్వర్ణముఖి నదీ పొర్లుకట్టలు తెగడంతో గంగనపాళెం, వాలమేడు, జమీన్ కొత్తపాళెం, పామంజి, తూపిలిపాళెం, కొండూరు, అందల మాల, ఉప్పరపాళెం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చలి తీవ్రతకు నలుగురు మరణించారు.
► వెంకటగిరి పరిధిలో 16 చెరువులకు గండ్లు పడ్డాయి. 13వేల ఎకరాల్లో వరి నీటమునిగింది.
► ఆత్మకూరు నియోజకవర్గంలో బొగ్గేరు, బీరాపేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 5వేల ఎకరాల్లో నాట్లు నీట మునిగాయి.
► ఉదయగిరి నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలకు రైలే ్వపట్టాలపైకి నీళ్లు చేరాయి. సూళ్లూరుపేట, తడ ప్రాంతంలో రైల్వే లైను వరద నీటితో నిండిపోయింది. దీంతో ఓవైపు మూసేశారు. దీంతో చెన్నై, విజయవాడ వైపు నడిచే పలు రైళ్లును రద్దు చేశారు.
 
 ప్రకాశం జిల్లాలో మూడు నియోజకవర్గాలు జలమయం
 ప్రకాశం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. గడిచిన రెండ్రోజుల్లో కేవలం రైతులే రూ.26.45 కోట్లమేర నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా. గిద్దలూరు నియోజకవర్గంలో నష్టతీవ్రత ఎక్కువగా ఉంది. రూ.17 కోట్ల విలువచేసే పంటలు నీటమునిగాయి. 15 వేల ఎకరాల్లో శనగ పంట చేతికి రాకుండాపోయింది. విత్తు విత్తగానే వర్షాలు పడుతుండడంతో అవి మొలకెత్తే పరిస్థితి లేదు. దాదాపు వెయ్యి ఎకరాల్లో మిర్చి పంట పరిస్థితి కూడా ఇదే. రూ.7 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. కందుకూరు నియోజకవర్గంలో 4,602 ఎకరాల్లో మినుము పంటను వేయగా పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. ఫలితంగా రూ.9.02 కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దర్శి నియోజకవర్గంలోని దాదాపు 50 ఎకరాల్లో మిర్చి పంట ఉరకెత్తింది. దీని కారణంగా రూ.25 లక్షల నష్టం వాటిల్లింది. చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
 
 చిత్తూరు జిల్లాపై తీవ్ర ప్రభావం..
 చిత్తూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కేవీబీపురం మండలం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లావ్యాప్తంగా ఆరు ఆవులు, ఏడు దూడలు, 15 గొర్రెలు, మూడు మేకలు మృతిచెందాయి. తొట్టంబేడు మండలం కారాకొల్లు గ్రామానికి చెందిన రమణయ్య (68), సత్యవేడు మండలం రాజులకండ్రిగ వంకలో తమిళనాడుకు చెందిన దీప (26)లు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. పూతలపట్టు మండలం పింఛా నదిపై నిర్మించిన రైల్వేవంతెన నీటి ప్రవాహానికి కోసుకుపోయి ప్రమాదకరంగా మారింది. దీంతో బ్రిడ్జి వద్దకు రాగానే రైలు వేగం తగ్గించి నడుపుతున్నారు. జిల్లావ్యాప్తంగా 14వేల హెక్టార్లల్లో పండ్లు, పూలతోటలు, వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి.

పిచ్చాటూరు మండలం రామాపురం కలుజు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో 200 ఇళ్లు, నాగలాపురం మండలం కృష్ణాపురం కలుజు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో నాగలాపురం దళితవాడలోని 150 ఇళ్లు నీట మునిగాయి. జిల్లాలోనే అతి పెద్ద చెరువుగా పేరుగాంచిన పెద్దతిప్ప సముద్రం మండలంలోని కందుకూరు వ్యాసరాయ సముద్రం చెరువు తూముకు బుధవారం గండి పడింది. నాగలాపురం వేదనారాయుణస్వామి ఆలయుం జలవుయుమైంది. ఆలయుంలోని ధ్వజ స్తంభ ప్రాంగణం, వుుఖవుండపం ప్రాంగణం, ఆలయు ప్రాకారం చుట్టూ మోకాలి లోతుకుపైగానీరు చేరి సరస్సును తలపిస్తోంది. నిండ్రలోని పెద్దచెరువుకు బుధవారం నిండిపోయి కలుజు పారుతోంది.

 2,06,675 హెక్టార్లలో పంట నష్టం
 సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలో 2,06,675 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ తేల్చింది. ఉభయ గోదావరి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయిలో పంటలకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేశారు. పంట నష్టం నివేదికకు బుధవారం రాత్రి తుది రూపు ఇచ్చారు. ఈ నివేదికను గురువారం ఢిల్లీకి పంపనున్నారు. నష్టపోయిన పంటల్లో వరి ప్రథమ స్థానంలో ఉండగా పత్తి దిగువ స్థానలో ఉంది. మొత్తం నష్టాన్ని రూ.426 కోట్లుగా అంచనా వేసిన ట్లు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement