మందేసి.. చిందేశారు
మందేసి.. చిందేశారు
Published Mon, Feb 27 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM
చేపల చెరువుల మధ్య రేవ్ పార్టీ
పశ్చిమకూ పాకిన నగర సంస్కృతి
పోలీసుల కళ్లుగప్పి చాలా రోజులుగా సాగుతున్న వ్యవహారం
ఎస్సై చొరవతో పట్టుబడిన యువతీ యువకులు
నిడమర్రు పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
మహా నగరాలు, రిసార్ట్స్‌కే పరిమితమైన రేవ్ పార్టీల సంస్కృతి పల్లెలకూ పాకింది. చేపల చెరువుల మధ్య నిర్మించిన గెస్ట్‌హౌస్‌లు ఈ అశ్లీల నృత్యాలకు వేదికగా మారాయి. దీన్ని ఒక వ్యాపారంగా నిర్వహిస్తున్నట్టు సమాచారం. కొల్లేరు ప్రాంతమైన నిడమర్రు మండలం పత్తేపురం శివారు ఆముదాలపల్లి గ్రామంలో చేపల చెరువుల వద్ద ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసుల దాడి చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పత్తేపురానికి చెందిన తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు చింతలపాటి చినమూర్తిరాజుకు ఆముదాలపల్లిలో చేపల చెరువుల వద్ద గెస్ట్‌హౌస్ ఉంది. అందులో జిల్లాలోని ఓ సామాజిక వర్గంకు చెందిన యువకులు రేవ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం, విజయవాడకు చెందిన యువకులు ఇందులో పాల్గొన్నారు. పోలీసుల దాడి జరపగా 16 మంది విటులు, 10 మంది యువతులు పట్టుబడ్డారు. ఈ దాడిలో భీమవరం పట్టణానికి చెందిన క్రికెట్ బుకీ, తాడేపల్లిగూడెంకు చెందిన ఓ ప్రముఖ బంగారం దుకాణం యజమాని కుమారుడు ఉన్నారు. గెస్ట్‌హౌస్‌లోని గదుల్లో కండోం ప్యాకెట్లు, మద్యం బాటిల్స్ కనిపించాయి. పోలీసులు గెస్ట్‌హౌస్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ నిర్వహించిన గెస్ట్‌హౌస్ యజమాని చింతలపాటి చినమూర్తిరాజు, చింతలపాటి గిరిరాజుపై కూడా కేసు నమోదు చేశారు. వీరిద్దరిని కేసు నుంచి తప్పించేందుకు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. పోలీసులు మాత్రం అందుకు అంగీకరించలేదు. 15 రోజులకు ఒకసారి ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. చేపల చెరువుల మధ్యన దూరంగా ఈ ప్రాంతం ఉండటంతో పోలీసులు ఇక్కడికి రావడం సాధ్యం కాదనే ఉద్దేశంతో కొంతకాలంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.
నిడమర్రు పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా
నిడమర్రు పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకూ హైడ్రామా జరిగింది. విషయం తెలిసిన వెంటనే మీడియా ప్రతినిధులు నిడమర్రు స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే, పట్టుబడిన వారిని చూపించేందుకు పోలీసు అధికారులు నిరాకరించారు. ఒక గంటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తామని.. ఆ తరువాత ఏలూరులో సమావేశం పెడతామని పోలీసులు గంటకో మాట చెబుతూ వచ్చారు. చివరకు పట్టుబడిన 26 మందిని నాలుగు వాహనాల్లో ఏలూరు తరలించారు. వారికి నిడమర్రు పోలీస్ స్టేషన్‌లో అన్ని మర్యాదలూ జరిగాయి. 16 మంది విటులు బయటకు వచ్చే సమయంలో పోలీస్ సిబ్బంది వారికి పేపర్లు ఇచ్చి మొహాలకు అడ్డం పెట్టుకోమని చెప్పారు. ఆ తరువాత వారిని ఏలూరులో మీడియాకు చూపించి స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన యువతులను ఏలూరులోని స్వధార్ హోమ్‌కు తరలించారు.
Advertisement
Advertisement