‘అనంత’ భూములు హాంఫట్!
♦ విక్రయానికి ఆర్ట్స్ అండ్ సైన్స్, కామర్స్ కళాశాల భూమి
♦ వికాసమండలి అనుమతి లేకుండానే లే అవుట్లు
♦ కాలేజీ పాలకమండలి తీరుపై సర్వత్రా విమర్శలు
♦ ఇప్పటికే పలు ప్లాట్ల అమ్మకం, ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు
♦ 1975లో చందాలు వేసుకుని 50 ఎకరాలు కొనుగోలు
♦ అందులో ఎస్‌ఏపీ కళాశాల ఏర్పాటుచేసి విద్యాబోధన
కళాశాలకు ఆస్తులు ఎలా వచ్చాయంటే.. ప్రజల ఆర్థిక సహాయంతో 1975లో ఈ ప్రాంతంలో ఎస్‌ఏపీ కళాశాలకు కల్కొడ లాల్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పట్టణ పెద్దలు స్థానిక రైతుల నుంచి డబ్బులు పోగేసి సుమారుగా 50 ఎకరాల వరకు స్థలాన్ని కొనుగోలు చేశారు. దానిలో ఎస్‌ఏపీ కళాశాలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు స్థలం 40 ఎకరాలే ఉందని సమాచారం.
వికారాబాద్ : సొమ్మొకరిది.. సోకొకరిది అన్నచందంగా ఉంది వికారాబాద్‌లోని శ్రీ అనంతపద్మనాభస్వామి ఆర్ట్స్ అండ్ సైన్స్, కామర్స్ కళాశాలకు చెందిన భూమి పరిస్థితి. ఈ కాలేజీకి చెందిన వికారాబాద్‌లోని సర్వే నంబర్ 245, 247లలో ఉన్న 5.13 గుంటలను విక్రయించేందుకు కళాశాల పాలకమండలి నిర్ణయించింది. ఈ మేరకు 2007లో ప్లాట్‌లు చేశారు. అమ్మకానికి వీలుగా ప్లాన్ తయారుచేసి లే అవుట్ అనుమతి కోసం స్థానిక మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో వికారాబాద్ మున్సిపల్ అధికారులు ఫైనల్ లే అవుట్ అనుమతికోసం (డీటీసీ) డెరైక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులకు పంపించారు. అధికారులు టెన్‌టీవ్ లే అవుట్‌కు అప్పట్లో అనుమతించారు. ఈ మేరకు 2008లో ఫైనల్ లే అవుట్ అప్రూవల్ కాలేదు. దీంతో అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన కొందరు ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తులు చేసుకున్నట్లు కొందరు మండలి సభ్యులు, ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కళాశాల మండలి చైర్మన్ మర్రి రవీందర్‌రెడ్డి కొనసాగుతున్నారు.
కళాశాల భూమిని లే అవుట్ ఎందుకు చేసినట్టు?
అసలు ఎస్‌ఏపీ కళాశాలకు సంబంధించిన భూమిని లే అవుట్లుగా చేయాల్సిన అవసరం ఏముంది. ఎందుకోసం లే అవుట్లు చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు అయిన కళాశాల ఆస్తులను విక్రయించడానికి ఎవరికి హక్కులు ఉన్నాయన్న సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. అసలు వికాసమండలిలో సభ్యులు ఎంతమంది ఉన్నారు, వారు ఎప్పటి నుంచి ఉన్నారు, ఎన్ని సంవత్సరాలకొకసారి సభ్యుల ఎంపిక జరుగుతుంది, ఏ ప్రాతిపదికన జరుగుతుంది అనే విషయాలు ఇప్పటి వరకు ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ విషయంలో పలుమార్లు పలువురు రాజకీయ నాయకులు ప్రశ్నించినా పాలకవర్గం స్పందించలేదు. అసలు అధికారం వికాసమండలికి ఉందా లేక కళాశాల ఛైర్మన్‌కు ఉందా అనే విషయం సైతం ఎవరికీ అంతుచిక్కడం లేదు. వికాసమండలి నియామకానికి నిబంధనలు ఏమిటి? చైర్మన్ ఎంపిక, అధికారాలు వంటి విషయాల్లో స్పష్టత కొరవడింది.
కళాశాల భూమిని విక్రయించాల్సి అవసరమేమొచ్చింది?
కళాశాల ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఏటా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తగ్గుతూనే వస్తున్నారు. గతంలో ఎస్‌ఏపీ కళాశాలలో ఇంటర్మీడియెట్ స్థాయి ఎడ్యుకేషర్ ఉంటే.. దాన్ని కూడా పాలకమండలి రద్దు చేసింది. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం నాడు కళాశాలను ఏర్పాటు చేశారు. కానీ, ఆ ఆశయం నీరుగారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకు విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. నేటి సమాజానికి అవసరమైన కొత్త కోర్సులను తీసుకురావడంలో పాలకమండలి విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
100 పడకల ఆస్పత్రి ఎదుటే లే అవుట్..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 100 పడకల ఆస్పత్రిని వికారాబాద్‌లో ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మేరకు రూ.10 కోట్లను విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటుచేసే ఆస్పత్రికి ఎదురుగానే ఈ లే అవుట్ ఉండడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ప్రస్తుతం అక్కడ మార్కెట్ విలువ ప్రకారం గజం రూ.6 వేల నుంచి 14 వేల వరకు పలుకుతోంది. కళాశాలకు చెందిన కోట్లాది రూపాయల భూమిని అమ్మకుండా చూడాలని స్థానికులు అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.