మూడు ముల్లుల గులాబీ
ఒకే పార్టీలో కడియం, ఎర్రబెల్లి, కొండా
జిల్లా టీఆర్‌ఎస్‌లో విభిన్న పరిస్థితి
విభేదాలు సమసిపోవడం కష్టమే
సయోధ్య, సమన్వయంపై కార్యకర్తల్లో సందేహాలు
ఇప్పటికే తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన టీఆర్‌ఎస్‌లోకి సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయూకర్‌రావు చేరడంతో జిల్లాలో ఆ పార్టీ మరింత బలం పుంజుకుంటుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు కీలక నేతలు ఎక్కువ మంది కావడంతో సమన్వయం లేక భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొండా మురళీధర్‌రావు ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరికీ మరొకరితో సత్సంబంధాలు లేవు. తీవ్రమైన విభేదాలు, వ్యక్తిగత వైరుధ్యాలు ఉన్నాయి. ఈ నేతలు టీఆర్‌ఎస్ బలోపేతం కోసం కలిసి పనిచేస్తారా అనేది ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది.
కడియం శ్రీహరి మంత్రిగా పనిచేశారు. దయాకర్‌రావు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, ప్రభుత్వ విప్‌గా వ్యవహరించారు. ఇద్దరు నేతల మధ్య అన్ని విషయాల్లోనూ భేదాభిప్రాయలు ఉండేవి. టీడీపీని రెండు వర్గాలుగా నడిపించారు. టీడీపీపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు తోడు, ఇద్దరు కీలక నేతల వర్గపోరుతోనే 2004 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా పరాజయం పాలైందనే అభిప్రాయం ‘దేశం’ శ్రేణుల్లో ఇప్పటికీ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై టీడీపీ వైఖరికి నిరసనగా కడియం శ్రీహరి 2014 ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. కడి యం శ్రీహరి అనూహ్య పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి టీడీఎల్పీ నేతగా నియమితులయ్యారు. వేర్వేరు పార్టీల్లో ఉన్న ఇద్దరు నేతల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఇద్దరి వ్యక్తిగత వైరం చివరికి పాలకుర్తి మార్కెట్ ఆవరణలో టీఆర్‌ఎస్-టీడీపీ నేతల మధ్య ఘర్షణ వరకు వెళ్లింది. ఇప్పుడు వీరిద్దరు ఎలా కలిసి పనిచేస్తారనేది భవిష్యత్ నిర్ణయించనుంది.
సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మధ్య సుదీర్ఘకాలంగా వైరం ఉంది. రెండు వర్గాల మధ్య హత్యా రాజకీయాలు కొనసాగాయనే అభిప్రా యం ఉంది. వీరి వర్గపోరుపై అసెంబ్లీ స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నారు. సాధారణ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన కొండా దంపతులకు రాజకీయంగా మంచి అవకాశాలు వచ్చాయి. కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికకాగా.. మురళీధర్‌రావుకు ఆ పార్టీ ఇటీవలే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. కొండా సురేఖకు మంత్రివర్గంలో ఎప్పటికైనా చోటు దక్కుతుందనే ఆశాభావంతో వీరి శిబి రం ఉంది. అరుుతే, మూడు రోజుల క్రితం టీ ఆర్‌ఎస్‌లో చేరిన తమ నాయకుడికి మంత్రి పదవిపై టీఆర్‌ఎస్ నాయకత్వం హామీ ఇచ్చిందని ఎర్రబెల్లి దయాకర్‌రావు సన్నిహితులు చెబుతున్నారు. జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నందున కొత్తగా మరో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉండదనే అభిప్రాయం ఉంది. ఒక్కరికే ఇస్తే వీరి లో ఎవరికి ఇస్తారు, పదవి దక్కని వారు వైఖరి భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారనుంది.
2014 సాధారణ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మధ్య అం తరం బాగానే ఉంది. దాదాపు రెండేళ్లుగా ఒకే పార్టీలో పనిచేస్తున్నా ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉన్నాయని టీఆర్‌ఎస్ వారే చెబుతుంటారు. కొండా మురళీధర్‌రా వు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే సందర్భంలోనూ జిల్లా నేతలెవరినీ పరిగణనలోకి తీసుకోకుండానే టీఆర్‌ఎస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం ఉంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమా ల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొనరని, ఇద్దరు నేతల మధ్య అంతరమే దీనికి కారణమని అంటున్నారు. ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన నేపథ్యంలో కడి యం, కొండా మధ్య సంబంధాలు మారతాయా, లేదా అనేది వేచి చూడాలి.