గోమాతకు సీమంతం
లక్ష్మీనగర్‌లో అపురూప వేడుక
పాపన్నపేట: మాతృత్వం మహిళకు ఓ వరం.. ప్రసవం పునర్జన్మతో సమానం.. అందుకే గర్భం దాల్చిన మహిళను ఇంటిల్లిపాది అపురూపంగా చూసుకుంటారు. ఐదు నెలలో సీమంతంచేసి రకరకాల తినుబండారాలుచేసి పెట్టడం ఆనవాయితీ. అయితే లక్ష్మీనగర్ గ్రామ మహిళలు మాత్రం కాస్తా వెరైటీగా ఆలోచించి గోమాతకు సీమంతంచేసి తమ జంతుప్రేమను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే... పాపన్నపేట మండలం లక్ష్మినగర్‌లో గ్రామస్తులు తమదైన రీతిలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల గ్రామపుట్టినరోజు జరుపుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే పవిత్రంగా పూజించే గోమాతకు గురువారం శ్రీమంతం చేశారు. మహిళలంతా ఒకచోటచేరి గోమాతను పసుపు, కుంకుమలు, పూలతో అలంకరించి, రకరకాల తినుబండారాలు చేసి పెట్టారు. సాధారణంగా గోమాతను మహిళతో సమానంగా గౌరవిస్తుంటారు. గ్రామీణ అన్నదాతలకు ఆవు బహుళ ప్రయోజనకారి. అందుకే నోరులేని ఆ సాధుజంతువుకు అపురూపమైన ఆతిథ్యం ఇవ్వాలనే ఆలోచన తమకు వచ్చిందని మహిళలు తెలిపారు.