అనుమానాస్పదంగా విలేకరి మృతి
అనంతపురం సెంట్రల్ : ఓ దినపత్రికలో పనిచేస్తున్న విలేకరి నరసప్ప అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నగర శివారులోని ప్రజాశక్తి నగర్‌లో నివాసముంటున్న ఆయన రక్తపు మడుగులో పడి మృతి చెందారు. విధులు ముగించుకుని సోమవారం మధ్యాహ్నం సమయంలో రూరల్ మండలం ప్రజాశక్తినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. రెండు రోజుల క్రితమే భార్య పుట్టింటికి వెళ్లింది. మరో భార్య స్వగ్రామం కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లిలో ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విలేకరి నరసప్ప మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన నోటిలో నుంచి రక్తం వచ్చినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అలాగే ఇటీవల సమీప బందువులతో మనస్పర్థలు ఏర్పడినట్లు సమాచారం. దీంతో పాటు అప్పులు కూడా అధికం కావడంతో తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యేవారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన మృతి చెందడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆకస్మికంగా మృతి చెందారా? లేదా ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం ఆయన గత కొద్ది కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందువల్లే చనిపోయారని పేర్కొంటున్నారు. రూరల్ సీఐ కృష్ణమోహన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతడికి ఇద్దరు భార్యలు, నలుగురు కుమారులు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన నరసప్ప కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని జర్నలిస్టు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల మృతి బాధాకరం
సోమవారం విలేకరి నరసప్ప, ఆదివారం ఫొటోగ్రాఫర్ ప్రభాకర్ ఆచారి మృతి చెందడం బాధాకరమని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.