ముంచేశారు
దశాబ్దాల పాటు పార్టీ జెండాలు మోసిన నేతలు, కార్యకర్తలను పార్టీ అధిష్టానం నిలువునా ముంచిందని టీడీపీ పాత నేతలు, కార్యకర్తలు పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ స్థాయిలో అన్ని అధికారాలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించడంపై పాత నేతలను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేసిన వారిని పక్కనపెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకున్నారు. నేతలతో పాటు కార్యకర్తల్లోనూ బాబు నిర్ణయంపై ఆగ్రహం పెల్లుబుక్కుతుంది. వ్యక్తిగత స్వార్థంతో డబ్బులు తీసుకొని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అధికారాలు అప్పగించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని, చంద్రబాబు అనాలోచిత నిర్ణయం పార్టీని నిలువునా ముంచుతుందని వారు తేల్చి చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సైతం చంద్రబాబు నిర్ణయాన్ని జీర్ణించుకున్నారు. ఇన్నాళ్లు పార్టీ జెండాలు మోసిన వారిని మోసగించడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:ఒంగోలులో ఆదివారం జరిగిన టీడీపీ జిల్లా సమన్వయకమిటీ సమావేశంలో ఎమ్మెల్యేలకే అన్ని అధికారాలు అప్పగిస్తున్నామంటూ పార్టీ పరిశీలకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రకటించారు. అధినేత చంద్రబాబు నిర్ణయం ఇదేనంటూ ఆయన తేల్చి చెప్పారు. ఎవరైనా వ్యతిరేకిస్తే ముఖ్యమంత్రి వద్దకే వెళ్లి తేల్చుకోవాలని కూడా స్పష్టం చేశారు. గిద్దలూరు, కందుకూరు, చీరాల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఇప్పటికే అధికారాలు అప్పగించినట్లు మంత్రి రావెల కిశోర్‌బాబుతో పాటు బుచ్చయ్యచౌదరి పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ముఖ్యనేతల సమక్షంలోనే స్పష్టం చేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి జరిగే జనచైతన్యయాత్రలను సైతం ఎమ్మెల్యేలే నిర్వహిస్తారని కూడా ప్రకటించారు.
అద్దంకిపై తర్జన భర్జన..
ఈ సమావేశంలో ఒక్క అద్దంకి నియోజకవర్గం విషయంలో నిర్ణయాన్ని మాత్రం వాయిదా వేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాతే దీనికి సంబంధించి ప్రకటన చేస్తామని చెప్పారు. ఈ నెల 30వ తేదీలోపు అద్దంకి విషయంపై స్పష్టత వస్తుందని బుచ్చయ్యచౌదరి ప్రకటించారు. దీంతో కరణం బలరాంకు ప్రాధాన్యత తగ్గించలేని పరిస్థితుల్లో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గొట్టిపాటికి పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు ముఖ్యమంత్రి ఇంకా ఒక నిర్ణయానికి రానట్లు సమాచారం. 30వ తేదీలోపే దీనిపై ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సి ఉంటుంది. అధిష్టానం నిర్ణయంపై ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న కరణం బలరాం, కరణం వెంకటేష్‌లు ముఖ్యమంత్రి వద్దే తేల్చుకోవాలని సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం వారి వైఖరిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రగిలిపోతున్న శివరాం..
ఇక కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేదే అధికారమంటూ అధిష్టానం ప్రకటించడంతో దివి శివరాం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తన సంగతి ఏమిటంటూ శివరాం బుచ్చయ్యచౌదరి, మంత్రి రావెలను అక్కడే నిలదీసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఉత్తర్వుల మేరకే తాము ఆ ప్రకటన చేశామని, ఏదైనా ఉంటే మీరు ముఖ్యమంత్రితోనే మాట్లాడుకోమంటూ వారు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి వద్దే తేల్చుకోవాలని శివరాం నిర్ణయించారు.
అధిష్టానానికి అన్నా అల్టిమేటం..
గిద్దలూరు ఎమ్మెల్యే అధికారాలు కట్టబెట్టడంపై మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆదివారం సమావేశానికి హాజరుకాని అన్నా రాంబాబు అదే సమయంలో హైదరాబాద్‌లో కేంద్రమంత్రి సుజనాచౌదరి, టీడీపీ ఎమ్మెల్సీ టి.డి. జనార్దన్‌లను కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. తనకు సమన్యాయం చేయకపోతే ఈ నెల 30న నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటిస్తానని అన్నా అధిష్టానానికి అల్టిమేటంను జారీ చేశారు.
అంతర్మథనంలో సునీత వర్గం..
ఇక చీరాలలోనూ ఇదే పరిస్థితి. ఇన్నాళ్లు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన తనను వంచించారంటూ పోతుల సునీత వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి సైతం తెచ్చారు. తాజాగా ఎమ్మెల్యేలకే అధికారమన్న అధిష్టానం నిర్ణయంతో సునీత వర్గం సైతం అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతుంది. టీడీపీ అధిష్టానం నిర్ణయంతో ఆ పార్టీ పాత ముఖ్య నేతలతో పాటు క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలు సైతం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.