బిల్లు ఆమోదించకుంటే పుట్టగతులుండవ్
కడప అగ్రికల్చర్ :
రాష్ట్రానికి ప్రత్యేకహోదా బిల్లు ఆమోదించకుండా మనీబిల్లు అని పక్కన పెట్టడం దారుణమని, బిల్లు ఆమోదించకుంటే బీజేపీ, టీడీపీలకు పుట్టగతులు ఉండవని శాసనమండలిలో ప్రతిపక్షనేత సి రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకహోదా బిల్లుపై చర్చ జరిగిందని, అదే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇది మనీ బిల్లు అని చెప్పడమంటే బాధ్యత నుంచి తప్పుకోవడమేనని అన్నారు. 2015 ఆగస్టులో ప్రత్యేక బిల్లు చర్చకు రాష్ట్రపతి అనుమతి లభించిదన్నారు. మరి ఇన్నిరోజులుగా ఇది మనీ బిల్లా, సాధారణ బిల్లునా అనే విషయం బీజేపీ మంత్రులకు, ప్రధానికి తెలియదా? అని ప్రశ్నించారు. అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలతో కలిసి మాట్లాడి మద్దతు కూడగట్టామన్నారు. ఏడాది పాటు సాగదీసి ఇప్పుడు బిల్లు చర్చకు రాగానే మనీ బిల్లు అనడం ఎంతవరకు సమంజసమన్నారు. చట్టంలో పొందుపరచినవి తెచ్చుకోలేని బలహీన ముఖ్యమంత్రి చంద్రబాబని దుయ్యబట్టారు. ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి,
వెంకయ్యనాయుడుకు ప్రత్యేకహోదా ఇవ్వడం ఇష్టం లేదన్నారు. అటు బీజేపీ, ఇటు టీడీపీ దొంగనాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు శల్యసారథ్యం వహిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు కనుక ఆమోదించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.