నేడు అంత ర్జాతీయ కవలల దినోత్సవం
సేమ్ టు సేమ్!
సృష్టిలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. ఆ ఏడుగురు.. ఎవరు ఎక్కడుంటారో.. ఎవరికీ తెలియదు. కానీ అందులో ఒకే రూపం.. కలిగిన ఇద్దరు పిల్లలు.. ఒకే ఇంట్లో ఉంటే.. అబ్బో అది గొప్ప అనుభూతే.. అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఒకే రూపంతో ఉండే కవలలంటే ఇష్టపడని హృదయముండదు. అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా ప్రాణాలు వేరైనా.. పోలికొక్కటే అన్నవిధంగా చూపరులను ఆకట్టుకుంటున్న జిల్లాలోని పలువురిపై కథనం..
చిత్తూరు(గిరింపేట): ఒకే పోలికతో ఉంటూ సమరూప, సహజాత కవలలు అనిపించుకుంటున్నారు జిల్లాలోని కొందరు. జంటగా జన్మించిన వారి కోసం ప్రపంచం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించింది. ఆరోజే ఫిబ్రవరి 22.. అంతర్జాతీయ కవలల దినోత్సవం. ఈ సందర్భంగా పలుచోట్ల ఆదివారం కవల పిల్లల సమావేశాలు ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించారు.
ఆధ్యాత్మిక నగరంలో..
తిరుపతి గాందీరోడ్డు: తిరుపతి నగరంలోనూ కవల పిల్లలు ఒకే రూపంతో చూపరులను ఆకట్టుకుంటున్నారు. వారిలో కొందరు..
ఒక్క పాఠశాలలోనే 28 జతల కవలపిల్లలు
ఒకటి రెండు కవల జంటలను చూస్తేనే ఆశ్చర్యం. అలాంటింది ఒకే చోట 28 జతల కవల పిల్లలను చూస్తే కచ్చితంగా సంభ్రమాశ్చర్యాలకు గురవ్వాల్సిందే. ఈ ఘనతను దక్కించుకుంది చిత్తూరు నగరంలోని క్యాంఫర్డు పాఠశాల. ఆ పాఠశాలలో చదివే కవల పిల్ల ల కోసం యాజమాన్యం 2006 నుంచి ఏటా వేడుకలు నిర్వహించి బహుమతులను అందజేస్తోంది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది.
స్ప్రింగ్‌డేల్ స్కూల్లో..
తిరుపతి-కరుకంబాడి రోడ్డులోని స్ప్రింగ్‌డేల్ స్కూల్లో ఆదివారం కవలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న కవలలు ఒకేరకమైన దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. వీరితో విద్యార్థులు, ఉపాధ్యాయులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా పాఠశాల అధినేత కెఎస్. వాసు మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు కవలల దినోత్సవంపై కూడా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
- తిరుపతి గాంధీరోడ్డు
శ్రీకాళహస్తిలో..
పట్టణంలోని భాష్యం స్కూల్‌లో నాల్గవ తరగతి చదువుతున్న దక్షిత, దీక్షిత సవురూప కవలలు. పట్టణానికి చెందిన అరవింద్‌రెడ్డి, గీతాభవానీ దంపతుల సంతానం అయిన వీరు 2006లో జన్మించారు. ఒకేస్కూల్‌లో ఒకే తరగతిలో చదువుతున్న వీరిని చూసి తోటివిద్యార్థులు సంభ్రవూశ్చర్యాలకు గురౌతుంటారు. అదేవిధంగా పట్టణంలోని షేక్ జలాల్‌బాషా,షేక్ జిలానీల వుుద్దుల పిల్లలు షేక్ హసీనా,షేక్ సవీనా కవల పిల్లలు 2013లో జన్మించారు. వీరు కూడా ఒకే విధంగా ఉండి చూపరులకు కనువిందు కలిగిస్తున్నారు.
- శ్రీకాళహస్తి
జ్యోతిశ్రీ.. జయశ్రీ..
గొల్లవానిగుంట ఆటోనగర్ లో నివాసం ఉంటున్న యధ భూషణం, లేట్ మాధవికి కవల ఆడపిల్లలు. ఒకరు జ్యోతిశ్రీ, మరొకరు జయశ్రీలు తిరుచానూరులోని హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్నారు. వీరిలో ఎవరు ఎవరో కనుక్కోలేక ఎన్నోసార్లు.. ఉపాధ్యాయులు, స్నేహితులు ఇబ్బంది పడ్డారు.
తేజశ్విని.. లక్ష్మీప్రసన్న..
జిల్లాలోని సదుం మండలం పుట్టావారిపల్లిలో నివాసం ఉంటున్న పి. రెడ్డిశేఖర్, పి. విజయకు కవల ఆడపిల్లలు. వీరిలో మొదటి పాప పిఆర్. లక్ష్మీప్రసన్న, రెండవ పాప పిఆర్. తేజశ్విని ప్రస్తుతం అదేగ్రామంలో యూకేజీ చదువుతున్నారు. వీరి పాఠశాలకు వెళితే నవ్వుల పువ్వులే.
తిరుపతి అన్నమయ్య సర్కిల్ వద్ద నివాసముంటున్న సహదేవ,అమృత దంపతుల సంతానం హేమవ తి, హేమలత. వీరు కవలలు. గేట్ కళాశాలలో బీబీఎం చదువుతున్నారు. ఒక్కోసారి వీరిని చూసి హేమావతి ఎవరు, హేమలత ఎవరో అని తల్లిదండ్రులే గుర్తు పట్టలేని పరిస్థితి. ఇక స్నేహితులకైతే రోజూ ఫజిలే.